చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌.. లెక్కలన్నింటా అక్రమాలే..!

చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ బట్టబయలవుతోంది.Latest Telugu News

Update: 2022-09-27 12:29 GMT

దిశ ప్రతినిధి,మేడ్చల్ : చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ బట్టబయలవుతోంది. చేప పిల్లల సంఖ్యలో దొంగ లెక్కలు చూపించి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారుల అలసత్వాన్ని, పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకొని కాంట్రాక్టర్లు అడ్డగోలు దందాకు పాల్పడుతున్నారు. ఈ నెల 21న శామీర్ పేట మండలంలో చేప పిల్లల పంపిణీలో జరిగిన అవకతవకలు మరవక ముందే.. తాజాగా మంగళవారం మేడ్చల్ మండలంలో అదే సీన్ రిపీట్ కావడం మత్స్య శాఖ అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

భారీ గోల్ మాల్..

తెలంగాణ సర్కారు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతేడాది కంటే ఈ సంవత్సరం అదనంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2021-22 సంవత్సరానికి గాను సమీకృత మత్స్య అభివృద్ది పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై మేడ్చల్ జిల్లాలోని 388 చెరువులలో 72.40 లక్షల చేప పిల్లలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

అయితే జిల్లా మత్స్య శాఖ అధికారుల అలసత్వం వల్ల చేప పిల్లల పంపిణీ షూరు చేసి నెల రోజులు కావస్తున్నా.. కేవలం 45 చెరువులలో 18 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. కానీ, వాస్తవానికి ఇది పన్నెండు నుంచి 15 లక్షలకు మించలేదని మత్స్య సహకార సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కాంట్రాక్టర్లు ఆడిందే ఆట..

మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్య కారులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, భారీ మొత్తంలో సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకోవడం కొంప ముంచింది. మత్స్యశాఖలో తగినంత ఉద్యోగులు, సిబ్బంది లేకపోవటంతో కాంట్రాక్టర్లు చేప పిల్లల సంఖ్యలో గోల్‌మాల్‌‌కు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ, జిల్లాలో సగానికిపైగా ఎమ్మెల్యేలు వీటి జోలికే వెళ్లలేదు.

దీంతో పర్యవేక్షణ లేదనే ధీమాతో కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై తమకు తోచిన విధంగా దొంగ లెక్కలు రాసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి చేపలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ లారీలు, డీసీఎం వ్యాన్లను ఉపయోగించారు. వ్యాన్లలో ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చిన నీటి ట్యాంకుల్లో చేప పిల్లలను వేసి రవాణా చేశారు. చెక్‌ పోస్టులు దాటిన చేప పిల్లల వాహనాలు, చెరువులకు రవాణా చేసిన వాహనాల సంఖ్యకు చాలా తేడా ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.

మారని తీరు..

చేప పిల్లల పంపిణీలో ప్రతి సారి భారీ అక్రమాలు ,అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. అయినా జిల్లా మత్స్య శాఖ అధికారుల్లో మార్పు రావడంలేదన్న విమర్శ లు ఉన్నాయి. ఈ నెల 21న శామీర్ పేట మండలంలోని పెద్దమ్మ తల్లి గుడి వద్ద చెరువులో 4.77 లక్షల చేప పిల్లలను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. 7 డీసీఎంలలో చేప పిల్లలను కాంట్రాక్టర్లు తీసుకువచ్చారు. అయితే స్థానిక మత్స్య సహకార సంఘం సభ్యుల ఫిర్యాదు మేరకు మండల ఎంపీపీ, జెడ్పీటీసీలు ఘటన స్థలానికి చేరుకొని చేపలను పరిశీలించగా, భారీ అవకతవకలు బయట పడ్డాయి. చేప పిల్లల పరిణామం తక్కువగా ఉండడమే కాకుండా, ఒక్కో ప్యాకెట్‌లో వెయ్యి ఉండాల్సిన చేప పిల్లలగాను కేవలం 800 మాత్రమే ఉన్నట్లు లెక్కల్లో ప్రజాప్రతినిధులు గుర్తించారు.

 

దీంతో చేప పిల్లలను తీసుకువచ్చిన డీసీఎంలను తిప్పి పంపారు. అయితే ఇదే తరహా మోసం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ చెరువులో చేప పిల్లలను వదిలేందుకు రెండు డీసీఎంలు రాగా, వాటిలో చేప పిల్లలు చిన్నవిగా ఉండటం.. లెక్కల్లో తేడాలు రావడంతో వాహనాలను తిరిగి వెనక్కి పంపారు. కాగా, చేప పిల్లల పంపిణీలో తరుచు అక్రమణలు బయటపడుతున్నా.. జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

నిబంధనలను ఉల్లంఘిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. శామీర్ పేట లో జరిగిన పొరపాట్లపై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను నివేధించాం.తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టులో పెడుతాం. నిర్దేశించిన సైజు ఉన్న చేప పిల్లలను మాత్రమే తీసుకుంటాం. లేదంటే తీసుకోం. చేప పిల్లలను వెనక్కి పంపిస్తాం..   - పూర్ణిమ, జిల్లా మత్స్య శాఖ అధికారి


Similar News