Borabanda: బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్‌లోని బోరబండ(Borabanda) బాలిక(Girl)ను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బోరబండ(Borabanda) బాలిక(Girl)ను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులపై పోలీసులు పోక్సో కేసు(POCSO Case) నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన బాలిక హైదరాబాద్ బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నది. అయితే జీతం కోసం బుధవారం ఉదయం మాదాపూర్ వెళ్లింది. ఈ క్రమంలో అదే హోటల్‌లో కుక్‌గా పనిచేసే బిహార్‌కు చెందిన యువకుడి(18)తో కలిసి రాత్రి 10.40 గంటల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. సంత ప్రాంతం వద్ద ఐదుగురు యువకులు ఆటోను అడ్డగించి ఆటో ఎక్కారు. వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితోపాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో సదరు దుండగులు దాడికి తెగబడ్డారు.. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు.
అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలోకి చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ నిందితులు ఇంట్లోకి చొరబడి బాలికను బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.. దీంతో పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.