వంతెనపై నుంచి కిందపడిన బైక్.. ఒకరి మృతి... మరొకరికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డి.హీరేహల్ మండలం ఓబులాపురం వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి బైక్ కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు కర్ణాటక అలకుందివాసిగా గుర్తించారు. పోస్టుమార్టంకు మృతదేహాన్ని, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే బైక్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రోడ్డుపై వాహనాలను అతి వేగంగా నడపొద్దని తెలిపారు. మద్యం సేవించి అసలు డ్రైవింగ్ చేయొద్దన్నారు. రోడ్డు రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.