MLA:ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు.. మేము మీ కోణంలో ఆలోచిస్తే తట్టుకోలేరు!

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-03-26 14:34 GMT
MLA:ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు.. మేము మీ కోణంలో ఆలోచిస్తే తట్టుకోలేరు!
  • whatsapp icon

దిశ, ధర్మవరం: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం రామగిరిలో జరిగిన సంఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రమంతా చూసిందన్నారు. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అసలు ఎంపీపీ విషయంలో మా సభ్యుల బలం లేదని అలాంటప్పుడు.. ఇందులో తమ జోక్యం ఎందుకు ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

ఉద్దేశపూర్వకంగా రామగిరి ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చి టీడీపీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. పక్కా పథకం ప్రకారమే వాహనాల్లో మారణాయుధాలు తీసుకొచ్చారని సునీత ఆరోపించారు. మొన్నటి రోజు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం చేయించారని.. ఇటీవల గ్రామాల్లో మళ్ళీ ఫ్యాక్షన్ కక్షలు రేపుతున్నారని ప్రకాష్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రామగిరిలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారు కాబట్టే అక్కడ పరిస్థితి చేయి దాటలేదన్నారు. తాను ఉదయం నుంచి ప్రజా దర్బార్ తో పాటు పార్టీ కార్యకర్తల సమావేశం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో సమావేశం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానన్నారు.

అసలు ఈ గొడవ జరిగిన తర్వాతే నాకు సమాచారం అందిందన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో ఒక బాధ్యత ఉంచారని. అందుకే మా ఆలోచన అంతా అభివృద్ధి వైపే ఉందన్నారు. మీరు పని లేక గ్రామాల్లో కక్షలు రేపుతున్నారని.. మీ కోణంలో మేము ఆలోచిస్తే.. మీరు తట్టుకోలేరని ఎమ్మెల్యే సునీత వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు కాబట్టే.. మీరు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. మరోసారి తమపై, టిడిపి నాయకుల పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సునీత హెచ్చరించారు.

Similar News