దిశ, జవహర్ నగర్ : జవహర్ నగర్ లో భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ వ్యాపారం చేస్తున్నారు. సర్కారీ స్థలాల్లోనే వెంచర్లు వేసి అమాయక జనానికి ప్లాట్లుగా విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి పాతిన హెచ్చరిక బోర్డులను సైతం రాత్రికి రాత్రే మాయం చేస్తూ.. అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు.
కంప్లైంట్ రాగానే అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేస్తారు. కానీ ఇక్కడి కొందరు ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణాలను కూల్చేసిన రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. కింది స్థాయి అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారికి సహకరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి.
కారకులు ఎవరు...?
స్థలం అమ్మింది ఒకరు.. అక్కడ నిర్మించుకున్న ఇంటికి నంబర్లు ఇచ్చింది మరొకరు. ఆ పరిసరాల్లో రోడ్లు వేసింది ఇంకొకరు. స్తంభాలు వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చేది మరొకరురు. ఈ మొత్తం వ్యవహారంలో స్థలం అమ్మిన వారు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు కాగా, మిగతా వారంతా అధికారులే. అధికారులే అన్నీ చేసి ఇంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత పట్టపగలు లేదా రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేతలు చేస్తారు.
వారి ఇండ్లు కూల్చివేతల భయంతో నిరుపేదలు లబోదిబోమంటున్నారు. అందరికీ కాసులు కురిపించాల్సిందే. ఏ ఒక్కరిని కాదన్నా కూల్చివేతలే శరణ్యం. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నడుస్తున్న తతంగం ఇది. దళారులు, నకిలీ విలేకర్లు, లీడర్లు, అధికారుల మధ్యలో అమాయక ప్రజలు పూర్తిగా బకరాలు అయిపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. వాళ్లే అన్నీ చేయిస్తూ వారే తిరిగి ఇండ్లు కూల్చివేయించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.
కొన్న స్థలంలోనే గూడు... బాధితులు
పైసా పైసా కూడ పెట్టుకుని ఉన్న స్థలంలో రేకుల ఇళ్లను నిర్మించుకుని, మున్సిపల్ అధికారులు ట్యాక్స్ కట్టించుకుని ఇళ్లల్లో ఉంటున్న వాళ్లని బయటకు తోసేసి అక్రమ నిర్మాణం అంటూ రెవెన్యూ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇళ్ల మధ్యలో నిర్మించుకున్న గూడును నేలమట్టం చేసేందుకు అధికారుల చర్యలు సబబు కాదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా కాసులకు కక్కుర్తిపడి పట్టపగలే బహిరంగ కబ్జాలకు పాల్పడుతున్నా ఎన్నో ఎకరాల భూములను వదిలేసి ఇళ్ల మధ్యలో నివాసం ఉంటున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు అధికారులు పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల రూపాయల డబ్బులు చెల్లించి తాము స్థలాలను కొన్నామని అట్టి స్థలంలోనే తమ రేకుల ఇళ్లను ఏర్పాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. రేకుల ఇళ్లను కట్టుకునే టైంలో కొందరు దళారులు, బస్తీ లీడర్లు, సుమారు 150 నుండి 200 మంది నకిలీ విలేకరులు ఒక్కొక్కరు ఒక్కో తీరులో తమ ఇంటిని ఫొటోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. డబ్బులు తాము ఇవ్వలేని స్థితిలో ప్రాధేయపడినా.. వినకుండా అధికారులతో కుమ్మక్కై తమ పేద ప్రజల గూడును నేలమట్టం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ముడుపులు చెల్లించలేక బాధిత పేద కుటుంబాలు తమ గూడును దక్కించుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అధికారులు, బాధితుల మధ్య ఘర్షణకు దారి తీస్తున్నాయి.
ఇందులో భాగంగానే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ (సర్వే నెంబర్ 645 646) ల్లో ఇళ్ల మధ్యలో కొత్తగా కట్టుకున్న రేకుల ఇళ్లను కూల్చేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో ఆర్ఐ రమేష్ మంగళవారం అక్కడకు వెళ్లారు. దీంతో బాధితులు తమ ఇళ్లను కూల్చొద్దంటూ అడ్డు తగిలారు. ఇళ్లల్లో ఉన్న మనుషులను బయటకు తోసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కొమ్మిగూడిన జనం ఒక్కసారిగా రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ
ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు దేవేందర్ నగర్, జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో విధుల నిర్వహణకు సర్వే నెంబర్ 645, 646 ప్రభుత్వ భూమి వద్దకు వెళ్లిన కాప్రా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ పై దుండగులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డిమాండ్ చేశాయి.
ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు చూడాలని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, జనరల్ సెక్రటరీ పాక రమేష్, రాష్ట్ర టీజీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ భిక్షం, టీజీటీఏ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు రాజేష్, సెక్రటరీ హసీనా, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.