అంతా.. ‘గూడు’ పుఠాణి..!
భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను అక్రమించి రియల్ వ్యాపారం చేస్తున్నారు.
దిశ, జవహర్ నగర్ : భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను అక్రమించి రియల్ వ్యాపారం చేస్తున్నారు. సర్కారీ స్థలాల్లోనే వెంచర్లు వేసి అమాయక జనానికి విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి పాతిన హెచ్చరిక బోర్డులను సైతం మాయం చేస్తూ.. అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. అక్రమ నిర్మాణం పై కంప్లెయింట్ వస్తేనే రెవెన్యూ అధికారులు కూల్చేస్తారు. కింది స్థాయి అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారికి సహకరిస్తున్న ఆరోపణలున్నాయి.
కారకులు ఎవరు ?
స్థలం అమ్మింది ఒకరు.. నిర్మించుకున్న ఇంటికి నెంబర్లు ఇచ్చింది మరొకరు. ఆ పరిసరాల్లో రోడ్లు వేసింది ఇంకొకరు. స్థంభాలు వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థలం అమ్మిన వారు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు కాగా, మిగతా వారంతా అధికారులే. అధికారులే అన్నీ చేసి ఇంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత పట్టపగలు లేదా రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేతలు చేస్తారు. వారి ఇండ్లు కూల్చివేతల భయంతో పేదలు లబోదిబోమంటున్నారు. అందరికీ కాసులు కురిపించాల్సిందే ! ఏ ఒక్కరిని కాదన్నా కూల్చివేతలే శరణ్యం.. మేడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నడుస్తున్న తతంగం ఇది. దళారులు, నకిలీ విలేకరులు, లీడర్లు, అధికారులు మధ్యలో అమాయక ప్రజలు పూర్తిగా మోసపోతున్నారు.
కొన్న స్థలంలోనే గూడు..
పైసా పైసా కూడబెట్టుకొని ఉన్న స్థలంలో రేకుల ఇళ్లను నిర్మించుకొని, మున్సిపల్ అధికారులు టాక్సులు సైతం కట్టించుకొని ఇళ్లల్లో ఉంటున్న వాళ్లను బయటకు తోసేసి అక్రమ నిర్మాణం అంటూ రెవెన్యూ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. గూడును నేలమట్టం చేసేందుకు అధికారుల చర్యలు సబబు కాదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేల రూపాయల డబ్బులు చెల్లించి స్థలాలను కొన్నామని ఆ స్థలంలోనే రేకుల ఇళ్లను ఏర్పాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఇళ్లను కట్టుకునే టైంలో దళారులు, బస్తీ లీడర్లు, 150 నుంచి 200 మంది నకిలీ విలేకరులు ఒక్కొక్కరు ఒక్కొ తీరులో తమ ఇంటిని ఫొటోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇచ్చే స్థితిలో లేమని ప్రాధేయపడినా వినకుండా అధికారులతో కుమ్మక్కై పేదల గూడును నేలమట్టం చేస్తున్నారని బాధితుల ఆరోపిస్తున్నారు.
ఇందులో భాగంగానే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ (సర్వే నెం. 645 646)లో కట్టుకున్న రేకుల ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో ఆర్ఐ రమేష్ మంగళవారం అక్కడకు వెళ్లారు. దీంతో బాధితులు తమ ఇళ్లను కూల్చోద్దంటూ అడ్డుతగిలారు. ఇళ్లల్లో ఉన్న మనుషులను బయటకు తోసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో గుమ్మిగూడిన జనం ఒక్కసారిగా రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
ఆర్ ఐ పై దాడిని ఖండిస్తున్నాం..
విధి నిర్వహణలో భాగంగా సర్వే నెం. 645, 646 ప్రభుత్వ భూమిలో అక్రమాలను తొలగించేందుకు మంగళవారం వచ్చిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రమేశ్ పై దాడిని ఖండిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డిమాండ్ చేసింది. ఈ నిరసనలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, సెక్రటరీ జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, జనరల్ సెక్రటరీ పాక రమేష్, రాష్ట్ర టీజీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ భిక్షం, టీజీటీఏ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు రాజేష్, సెక్రటరీ హసీనా, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.