రైట్ రైట్ కట్టేసుకోండి.. చట్టాలతో మీకేం పని..
రైట్.. రైట్.. అక్రమ నిర్మాణాలు కట్టేసుకోండి.. మున్సిపల్ చట్టం, అగ్నిమాపక చట్టాలతో మీకేం పని అంటూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తోంది.
దిశ, కుత్బుల్లాపూర్ : రైట్.. రైట్.. అక్రమ నిర్మాణాలు కట్టేసుకోండి.. మున్సిపల్ చట్టం, అగ్నిమాపక చట్టాలతో మీకేం పని అంటూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్, ఏసీపీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి వరకు ముడుపులు తీసుకుంటూ అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నా పట్టింపు లేదు.. రెండు ఫ్లోర్ల వరకు అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులతో 5, 6 ఫ్లోర్ల వరకు ఇల్లీగల్ గా నిర్మిస్తూ, చట్టాలకు పంగనామాలు పెడుతున్నారు. ఇంత చట్ట విరుద్దంగా జరుగుతున్నా, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ కమిషనర్, ఏసీపీ శ్రద్ద చూపకుండా కార్యాలయానికే పరిమితం కావడం అనుమానాలకు తావిస్తుంది. ఇలా ఎన్నో అక్రమ నిర్మాణాల వెనుక అధికారులు, కొందరు చైన్ మెన్ లు ఉంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఆజ్యం పోస్తున్నారు.
నిజాంపేట్ లో అక్రమ కమర్షియల్ షెటర్స్..
నిజాంపేట్ విలేజ్ లో కల్పనా గ్యాస్ గోదాం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో వారం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కాలరాస్తూ దర్జాగా అక్రమ నిర్మాణం చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీ ఓనర్ తో మీలాకత్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ రాబడికి మంగళం పాడి తమ జేబులోకి అమ్యామ్యాలు మళ్లిస్తూ నిజాంపేట్ కార్పొరేషన్ కి అపవాదు తెస్తున్నారు. కమర్షియల్ షెటర్స్ తో అక్రమ గదులు వేసిన ప్రదేశానికి అతి సమీపంలో గ్యాస్ గోదాం ఉండడంతో ఎప్పుడైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణంను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేట్ విజ్ఞాన్ హై స్కూల్ కు వెళ్లే దారిలో రోడ్డును కబ్జా చేసి అక్రమంగా ఓ రూము నిర్మించారు. ఈ రోడ్డు ఆక్రమణ పై కూడా పలు మార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.