గంజాయి మత్తులో యువత..
విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు వడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
దిశ, కేసముద్రం : విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు వడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా కొన్ని గ్రామాలను, గ్రామ శివారులో ఉన్న గుట్టలను, అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గత సంవత్సరం కేసముద్రం పట్టణంలో అప్పటి ఎస్సై నుమారు 16 కేజీల గంజాయిని పట్టుకోవటంతో ఉలిక్కి పడింది కేసముద్రం పట్టణం. ఆ సంఘటనతో గంజాయి ఏ మేర విక్రయాలు సాగుతున్నాయో అనడానికి నిదర్శనం. కొందరు యువకులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ హుక్కా తరహాలో పీల్చడం యువకులకు అలవాటు అయ్యింది. మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు. కొత్త ప్రపంచం.. ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ గంజాయి వ్యసనాన్ని అంటురోగంగా చేసుకుంటూ మత్తే ప్రపంచంగా గంజాయికి బానిస అవుతుంది. బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పిల్లలకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
తల్లిదండ్రులదే బాధ్యత... కదలికల పై దృష్టి పెట్టాలి..
పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి వ్యసనాల బారిన పడితే వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో, ఒంటరితనం భావనతో కొందరు, చెడు స్నేహాలతో మరికొందరు, ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం, గంజాయి తాగితే, మనసుకు దాని పట్ల ఆకర్షణ పెరిగిపోయి. మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. మెదడును ఉత్తేజపరిచే మద్యం గంజాయి క్రమంగా దానికి బానిసను చేస్తుంది. తర్వాత మెదడు చురుకుదనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
ప్రాథమిక స్థాయిలోనే అరికట్టాలి..
మత్తుకు బాని పై తీవ్ర మానసిక సమస్యలకు దారి తీయక ముందే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా మద్యం పొగ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాల్సిన అవసరముంది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో పార్టీలంటూ తరచూ పిల్లలు స్నేహితులతో కలిసి బయటకు వెళ్తుంటే అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తలు ఉద్యోగులైతే పిల్లల్ని అశ్రద్ధ చేయడం కనిపిస్తోంది. దీంతో వారిలో తాము ఒంటరి అనే భావన కలిగి చివరికి చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ఇంట్లో పెద్దలకు నమయం లేకపోయినప్పటికీ పిల్లలతో గడిపేందుకు ప్రణాళిక వేసుకోవాల్సిన అవనరం ఉంది.
కనీసం వారంలో ఒకరోజైనా పూర్తిగా వారితో గడపాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచి విలువలు నేర్పిస్తూ పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలని సూచిస్తున్నారు. యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. కాలేజీలకు వెళ్తున్నారా లేదా. ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాల పై దృష్టి సారించాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని నూచిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం.. కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్..
గంజాయికి బానిసలు అవుతున్న యువత, చెడువ్యననాలు పట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని కేసముద్రం ఎస్ఐ మురళీధర్ తెలిపారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని గంజాయి రవాణా చేసిన, అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని, నమాచారం తెలిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం అని ఎస్ఐ మురళీధర్ రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కొంత సేపటి మత్తు కోసం యువత జీవితాలు నాశనం చేసుకోకూడదని ఆశిద్దాం.