MLA Donthi : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు.
దిశ, దుగ్గొండి: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మధిర గ్రామంలో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలెట్ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతున్నప్పటికీ, ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందేలా అమలు చేస్తామన్నారు. ఇందిరమ్మ పాలన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, కొత్త డిజిటల్ కార్డు లో కుటుంబ డేటా మొత్తం పొందపరచబడుతుందని అన్నారు.
ఈ కార్డు ద్వారా రేషన్ తో పాటు ఆరోగ్య, సంక్షేమ పథకాలు లబ్ధి పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు. నియోజకవర్గం లోని 179 గ్రామపంచాయతీల్లో మధిర గ్రామాన్ని పైలెట్ గా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం గ్రామంలో డిజిటల్ కార్డు సర్వే చేపట్టారు. కార్యక్రమంలో ఆర్డీవో కే. కృష్ణవేణి, తహసీల్దార్ రవి చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, ఎంపీడీవో డాక్టర్ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు ధంజానాయక్ రామారావు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరి కిరణ్ రెడ్డి, ఓలిగే నర్సింగారావు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.