అయ్యప్పమాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కు అవమానం.. డిపో ముట్టడించిన మాలధారులు
మహబూబాబాద్ జిల్లాలో అయ్యప్ప మాలధారుడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడం కలకలం రేపింది. తొర్రూరు డిపో వద్ద అయ్యప్ప మాలలో ఉన్న డ్రైవర్ కు సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్/తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. ప్రతిరోజు డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో భాగంగా అయ్యప్ప మల ధరించిన నాగరాజుపై ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. అయితే, అయ్యప్ప మాల ధరించి ఉపవాసం ఉండటంతో, తనపై బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయవద్దని నాగరాజు.. కానిస్టేబుల్ హేమలతను కోరినా, వినకుండా అదేవిధంగా ప్రవర్తించడంతో డ్రైవర్ నాగరాజు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సమాచారం. ఈ చర్య ఆయా భక్తుల మనోభావాలకు విరుద్ధమని అయ్యప్ప స్వామి భక్తి మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు.
అయ్యప్ప భక్తుల నిరసన
ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు తొర్రూరు ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలు అయ్యప్ప స్వామి ఆచారాలను అవమానపరిచేలా ఉన్నాయని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు క్షమాపణ చెప్పేదాకా దీక్షను విరమించుకోమని డిమాండ్ చేశారు.
అధికారుల క్షమాపణ
వివాదం అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ అద్మవతి స్పందించారు. అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని సమర్థించుకుని, క్షమాపణలు చెబుతూ, భవిష్యత్తులో డిపోలోని ఉద్యోగుల ఆచారాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో భక్తుల భావాలను గౌరవించాల్సిన అవసరాన్ని, ఉద్యోగులకు వ్యక్తిగత హక్కులు, ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు.