తొర్రూర్ ఎంపీడీవో నరసింగరావు సస్పెన్షన్...
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల ఎంపీడీవో నర్సింగారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల ఎంపీడీవో నర్సింగారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యకు ప్రధాన కారణం పెద్ద వంగర మండలం బొమ్మకల్లు గ్రామ పంచాయతీ ఖాతా నుంచి జరిగిన ఆర్థిక అక్రమాలు కారణం. అదేవిధంగా ఎంపీఓ పూర్ణచందర్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తొర్రూరు ఇన్చార్జ్ ఎంపీడీవోగా పెద్దవంగర ఎంపీడీవో వేణుమాధవ్ ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
డబ్బులను డ్రా చేసిన తొర్రూరు ఎంపీడీవో..
పెద్దవంగార మండలంలోని బొమ్మకల్ గ్రామ గ్రామపంచాయతీ నిధులను తొర్రూరు ఎంపీడీవో నరసింగరావు పక్కదారి పట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ నాయక్ వివరాల ప్రకారం... బొమ్మకల్ గ్రామంలో 2024 అక్టోబరు మాసంలో మొక్కల పెంపకానికి సంబంధించి (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) ఖాతా నెంబర్ 62242436904 రూ.2 లక్షలు జమ అయ్యాయి. ఆ నగదు నుంచి జీపీ అవసరాల కోసం కొంత ఖర్చు చేయగా, జనవరి 3వ తేదీ వరకు రూ.1.78 లక్షలు నిల్వ ఉన్నాయి. ఈనెల 4వ తేదీన పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి సంతకాలు లేకుండానే గ్రామపంచాయతీ నిధులు రూ.1.10 లక్షలు తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావు తన వ్యక్తిగత ఖాతా నెంబర్ 52201614803కి ట్రాన్స్ఫర్ అయినట్లు శనివారం సాయంత్రం మెసేజ్ వచ్చింది.
ఈ విషయంపై సోమవారం తొర్రూరు ఎస్బీఐ బ్యాంకు అధికారులను గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ నాయక్ ఎస్బీఐలో నిధుల బదిలీ కోసం అందించిన ప్రొసిడింగ్ లెటర్ అడుగగా.. ఈనెల 3వ తేదీన ఎంపీడీవో నర్సింగరావు స్పేసీ మన్ సిగ్నేచర్ (ప్రొసీడింగ్ లెటర్) అప్లోడ్ చేయించుకొని, 4వ తేదీన రూ.1.10 లక్షలు ఆయన వ్యక్తిగత ఖాతా నెంబర్ 52201614803కు బదిలీ ఆయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోమవారం 6వ తేదీన సాయంత్రం రూ.110 లక్షలు తిరిగి జీపీ ఖాతాలో జమ అయినట్లు పంచాయతీ కార్యదరికి మెసేజ్ వచ్చింది. దీనిపై జడ్పీ సీఈవోను పురుషోత్తం ను వివరణ కోరగా..గ్రామ పంచాయతీ నిధుల బదిలీకి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, పెద్దవంగర ఎంపీడీవో వేణుమాధవ్ ను పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నిధుల బదిలీకి సంబంధించి జిల్లాలో చర్చనీయాంశమైంది.