హైద‌రాబాద్‌ను ప్రతిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూప‌క‌ల్పన చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Update: 2025-01-09 17:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూప‌క‌ల్పన చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్రయ భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్రణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వహించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని, ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్రయం ఉండాల‌ని ముఖ్యమంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. కొచ్చి విమానాశ్రయం అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని.. దానిని ప‌రిశీలించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. వ‌రంగ‌ల్ అవుట‌ర్ రింగు రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాల‌ని సీఎం అన్నారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాతో పాటు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల ప్రజ‌లు భ‌విష్యత్‌లో వ‌రంగ‌ల్ విమానాశ్రయం నుంచే రాక‌పోక‌లకు వీలుగా ర‌హ‌దారులు నిర్మించేలా ప్రణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌ర ప‌రిశ్రమ‌ల అభివృద్ధితో హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ ఎదిగేలా ప్రణాళిక‌లు ఉండాల‌ని సీఎం సూచించారు. వ‌రంగ‌ల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాత‌ర‌తో పాటు ల‌క్నవ‌రం, రామ‌ప్ప ఇత‌ర ప‌ర్యాట‌క ప్రదేశాల‌కు వ‌చ్చే ప్రజ‌లు సైతం దానినే వినియోగించుకుంటార‌ని సీఎం తెలిపారు. స‌మీక్షలో రాష్ట్ర మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ‌, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే కె.జ‌య్‌వీర్ రెడ్డి, ప్రభుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు,ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి వికాస్ రాజ్‌, వ‌రంగ‌ల్ క‌లెక్టర్ స‌త్య శార‌ద‌, వ‌రంగ‌ల్ ఆర్డీవో స‌త్య పాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News