ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి : మహబూబాబాద్ కలెక్టర్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు శుద్ధి చేసిన ధాన్యం కేంద్రాలకు
దిశ, కొత్తగూడ: ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు శుద్ధి చేసిన ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.బుధవారం కొత్తగూడ మండలం పోగుల్లపల్లి, ఓటాయి, రేణ్యాతండ, సాదిరెడ్డిపల్లి, గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శుద్ధి చేసిన ధాన్యం మ్యాచ్చర్ వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. అక్కడ పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లతో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రైతుల వివరాల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మేర తేమ, తాలు,చెత్త లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకురావాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలు పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.
అనంతరం కొత్తగూడ మండలంలోని సాది రెడ్డిపల్లి, గంగారం మండల ఆశ్రమ పాఠశాల, కస్తూరిభా గాందీ బాలికా విద్యాలయాలను తనిఖీ చేసి భోధన తరగాతులను, డైనింగ్ హాలును, కిచెన్ షెడ్, టాయిలెట్ లను పరిశీలించి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విద్యార్థుల యొక్క నైపుణ్యతను అడిగి తెలుసుకున్నారు. గంగారం పీహెచ్సీ ని తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ లకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వైద్య అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి,ఎంపీడీఓలు రవీంద్ర ప్రసాద్,అప్పారావు,ప్రత్యేక అధికారి సురేష్,వ్యవసాయ శాఖ అధికారి జక్కల ఉదయ్,రాంబాబు,వైద్య అధికారి ప్రత్యూష,ఎం ఈ ఓ లు గుమ్మడి లక్ష్మి నారాయణ,రమాదేవి,మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.