బల్దియాలో పైపులైన్ లీకేజీలు..నల్లా నీళ్లు వీధుల పాలు
ప్రజోపయోగ ప్రణాళికలు రూపొందించడంలో వరంగల్ మహానగర
దిశ,వరంగల్ టౌన్ : ప్రజోపయోగ ప్రణాళికలు రూపొందించడంలో వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనులన్నింటిలో లోపాలు తాండవిస్తున్నాయి. మరమ్మతు పనులు తరచూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రజాధనం వినియోగంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
పైపులైన్ల లీకేజీల జాతర!
నగరంలో పైపులైన్ల లీకేజీల జాతర కొనసాగుతోంది. వరంగల్ అండర్ రైల్వే గేటు ప్రాంతం, శివనగర్, కాశిబుగ్గ, దేశాయిపేట ప్రాంతాల్లో లీకేజీల పరంపర నిత్యకృత్యంగా మారింది. మరమ్మతులు చేస్తున్న పదేపదే లీకేజీలు ఏర్పడుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. పోచమ్మమైదాన్ కూడలిలో మూడు నెలల కిందటే పైపులైను లీకేజీ రిపేరు చేశారు. నెల రోజులు అయిందో లేదో.. మళ్లీ లీకేజీ ఏర్పడింది. నల్లా నీరు వదిలితే చాలు దేశాయిపేట వైపు నీళ్లు పరుగులు తీస్తున్నాయి. గతంలో తవ్విన ఆనవాళ్లు అలాగే ఉండగానే మళ్లీ తవ్వడం బల్దియా పనితీరుకు అద్దం పడుతోంది. రిపేరు చేసినప్పుడల్లా వేలకు వేలు ఖర్చు చేయడంతోపాటు ప్రజలకు మూడు, నాలుగు రోజులపాటు ప్రయాణ సంకటం, అలాగే నల్లా నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే పరిస్థితి కాశిబుగ్గ తిలక్ రోడ్డులోనూ నెలకొంటోంది.
ఇక్కడ సైతం తరచూ రిపేర్లతో స్థానికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే రోడ్డుపై శక్తి ఎలక్ట్రికల్స్ వద్ద పైప్ లైన్ లీకేజీ కావడంతో నల్లాలు రావడం లేదని గ్రీవెన్స్‌లో రెండు ఏండ్ల నుంచి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే రోడ్డుపై కోతి బొమ్మ వద్ద, అలాగే పలు వీధుల్లో లీకేజీలకు కొదవలేదు. వివేకానంద కాలనీ-2 బోర్డు వద్ద మోరీలో గల పైపులైను దెబ్బతిని నీళ్లు వృథాగా పోతున్నాయి. కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉండగా పట్టించుకునే వారే లేరు. దేశాయిపేట ప్రధాన రహదారిలో ఓ ఫంక్షన్‌హాల్ సమీపంలో రోడ్డు చివర పైపులైను లీకేజీ ఏర్పడి నీరు ఉప్పొంగిపోతోంది. ఫిల్టర్‌బెడ్ సమీపంలో ఓ మార్వాడి హోటల్ వద్ద పైపులైన్ లీకేజీలతో నీరు వరదలా ప్రవహిస్తున్నాయి.
ఎందుకీ పరిస్థితి?
కొన్నేళ్లుగా ఈ ప్రాంతాల్లో రిపేర్లు జరుగుతూనే ఉన్నాయి. లీకేజీ ఏర్పడిన మూడు నెలలకు స్పందించే బల్దియా మూడురోజుల పాటు కష్టాలు పడి మరమ్మతులు చేస్తున్న మళ్లీ మళ్లీ లీకేజీలు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అంటే చేసే పనులు సరిగా చేయడం లేదా? లేదా..? శాశ్వత పరిష్కారం చూపితే బల్దియా చేతికి పని ఉండదా? లేదంటే కమీషన్లు దొరకవా? అనే సందేహాలు కలుగుతున్నాయి. బల్దియా తీరుతో రాచపుండు లా మారిన ఈ లీకేజీల పర్వం ఇలాగే కొనసాగుతుందా? లేదంటే శాశ్వత పరిష్కారానికి ఇప్పటికైనా ప్రణాళికలు సిద్ధం చేస్తారా? అనేది వేచి చూడాలి.