జిల్లాల్లోనూ హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌

రాష్ట్ర రాజ‌ధానిలో అమ‌లు చేస్తున్న హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌ల‌ను జిల్లాల్లోనూ తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Update: 2024-09-03 13:17 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్ర రాజ‌ధానిలో అమ‌లు చేస్తున్న హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌ల‌ను జిల్లాల్లోనూ తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను నేలమేట్టం చేసేందుకు తీసుకొచ్చిన హైడ్రాలాంటి వ్యవస్థను జిల్లాలోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఆయా జిల్లాల ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంద‌ని అన్నారు. హైడ్రాపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నార‌ని అన్నారు. హైడ్రా అనేది ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎక్కడా ఆగలేదని ఆయన తెలిపారు. రాంనగర్ నాలాపై అక్రమకట్టడాలను తొలగించడం వల్ల ఈరోజు ముప్పు తప్పిందని అన్నారు. ప్ర‌తి జిల్లాల్లో హైడ్రాలాంటి వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేలా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని తెలిపారు.

    చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై నిర్ధిష్ట‌మైన స‌ర్వేలు నిర్వ‌హించి నివేదిక‌లు త‌యారు చేయాల‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల‌పై స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌ని, ఆక్ర‌మ‌ణ‌ల‌ను ఎంత‌మాత్రం ఉపేక్షించ‌బోమ‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే కోర్టు కేసుల‌ను సైతం ఎదుర్కోవాల‌ని, ఆక్ర‌మ‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం కూల్చివేత‌లు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి, సీత‌క్క‌, స్థానిక ఎమ్మెల్యేలు ముర‌ళీనాయ‌క్‌, రాంచంద్రునాయక్‌, య‌శ‌స్వినిరెడ్డిల‌తో పాటు ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మీక్ష‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌తోనే వ‌ర‌ద‌లు..!

ప్రకృతి మీద మనుషులు దాడి చేస్తే.. తిరిగి ప్రకృతి దాడి చేస్తుందనడానికి ఇటీవల జరిగిన విపత్తు నిదర్శనమని రేవంత్ అన్నారు. ఇది ఒక గుణపాఠమని ఉత్తరాఖండ్, ఏపీ, తెలంగాణ ఏ ప్రాంతమైనా.. దీన్ని గుణపాఠంగా చేసుకోవాలని రేవంత్ అన్నారు. జ‌లాశ‌యాల్లో అక్ర‌మ నిర్మాణాల‌తోనే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల ముప్పు ఎక్కువ‌గా ఉంటోంద‌ని సీఎం అన్నారు. ఖమ్మం మున్నేరు చుట్టు ప‌క్క‌ల ఆక్ర‌మ‌ణ‌లు చేయ‌డంతోనే వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్‌, ఆయ‌న అనుచ‌రులు ఇష్టారాజ్యంగా క‌బ్జాలు చేశార‌ని అన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యమిస్తామన్నారు.

     పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్​రావు డిమాండ్‌ చేయగలరా? అంటూ సీఎం స‌వాల్ విసిరారు. చెరువులను కబ్జా చేయడం వలన ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా హైడ్రా ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెరువులు కుంటలు ఆక్రమించుకున్న అక్రమార్కుల భరతం పట్టి భవిష్యత్తులో ముంపు రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలుంటాయ‌ని తెలిపారు.

Tags:    

Similar News