స్పందించిన హృదయాలు.. బతికొచ్చిన బాలుడు

తల్లి ఆరోగ్య స్థితి.. తండ్రి ఉన్నా బాల్యంలోనే విడిచిపెట్టాడు. అలాంటి స్థితిలో అమ్మమ్మ చేరదీసి సాకుతూ ప్రభుత్వ బడికి పంపుతోంది.

Update: 2024-10-01 12:04 GMT

దిశ, డోర్నకల్: తల్లి ఆరోగ్య స్థితి.. తండ్రి ఉన్నా బాల్యంలోనే విడిచిపెట్టాడు. అలాంటి స్థితిలో అమ్మమ్మ చేరదీసి సాకుతూ ప్రభుత్వ బడికి పంపుతోంది. ఇంతలోనే మాయదారి జబ్బు వచ్చి ప్రాణాన్ని హరించేంత జఠిలమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్పందించి బాలుడిని కాపాడుకున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం విద్యే కాదు. కష్ట సమయంలో విద్యార్థికి వెన్నుదన్నుగా ఉంటామని నిరూపించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని పంపు బావి తండాకు చెందిన రమావత్ అశోక్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే అంత చిన్న ప్రాణానికి పెద్ద గండం వచ్చింది. ఇటీవల డెంగ్యూ బారిన పడగా ఆ తర్వాత షుగర్, థైరాయిడ్, కిడ్నీ, లివర్ సంబంధిత ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు.

అయితే చికిత్స నిమిత్తం ప్రతిరోజు రూ. 2,500 విలువచేసే మందులు ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలని అక్కడి వైద్యులు సూచించారు. రెక్కల కష్టం మీద బతికే తాము అంత ఖర్చు భరించలేమని, అశోక్ అమ్మమ్మ తన గోడును బాలుడు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజిలిన్ కు వివరించింది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు రోజిలిన్, ఉపాధ్యాయులు చికిత్స పొందుతున్న విద్యార్థి ని చరవాణి ద్వారా పరామర్శించారు. ఆ సమయంలో "టీచర్ నేను బతకనేమో" అని బాలుడు అన్న మాటలు అందరి హృదయాలను కదిలించాయి. వెంటనే ఉపాధ్యాయులు తమకు తోచినంత డబ్బును చందాలుగా వేసుకుని అమ్మమ్మకు అందించారు. కాంప్లెక్స్ హెచ్ఎం బండి నరసింహారావు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద నుంచి విరాళాలు సేకరించి బాధిత విద్యార్థి అమ్మమ్మకు అందజేశారు.

అంతే కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి విషయం తెలియజేయగా ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ఆయన విద్యార్థికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కూడా స్పందించి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించాలని ఎంజీఎం వైద్యులకు సూచించారు. దీంతో అక్కడి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అశోక్ కు మెరుగైన వైద్యం అందించగా బాలుడు కోలుకుని మళ్లీ మంగళవారం తిరిగి పాఠశాలకు వచ్చాడు. ఉపాధ్యాయులను కలిసి ఆత్మీయంగా హత్తుకున్నాడు. తన మనవడు బ్రతకడు అన్న సమయంలో తనకు చేదోడు వాదోడుగా నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఉపాధ్యాయులకు అశోక్ అమ్మమ్మ కృతజ్ఞతాభివందనాలు తెలిపింది.


Similar News