తాగునీటి కష్టాలు తప్పడం లేదు.. దుర్భరంగా ఆదివాసీల జీవనం

సాధారణంగా వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తుతాయి.

Update: 2024-06-26 14:16 GMT

దిశ, మల్హర్ : సాధారణంగా వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తుతాయి. మండల కేంద్రం తాడిచర్ల పంచాయతీ పరిధిలోని కాపురం ఆదివాసి ప్రజలకు మాత్రం కాలానికి అతీతంగా ఎప్పుడు బడితే అప్పుడు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో తాగునీటికి కష్టాలు పడుతున్నారంటే ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పుకోవాలి. కానీ ఈ ఆదివాసీ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఐదు రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. స్నానం చేయడం లేదు, వంట చేసుకోవడం లేదు, తాగడం లేదు ఎలా బతుకుడు అంటూ పడుతున్న ఇబ్బందులు వెళ్లగక్కడానికి బుధవారం ఏఎమ్మార్ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్ కి వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్ గెంటేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా గుక్కెడు నీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదివాసీ ప్రజలు వాపోయారు. ఒకప్పుడు ఈ గ్రామం తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా అన్ని సౌకర్యాలు సమకూర్చిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో కష్టాలు మొదలయ్యాయిని ఆదివాసీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుండి కట్టుకున్న మా ఆవాసాల చుట్టూ ఏఎమ్మార్ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ సంస్థ ఓపెన్ కాస్ట్ కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి పోసిన మట్టి వల్ల దుమ్ము ధూళితో ఇబ్బందులు పెట్టిందని, డేంజర్ జోన్ గా ప్రకటించి తాడిచర్ల గ్రామంలో ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పథకం కింద ఇండ్ల ప్లాట్లు కేటాయించిన అక్కడికి పోవడానికి నిరాకరించామని అందుకు ఏఎమ్మార్ కంపెనీనే భూమి కొనుగోలు చేసిన గుట్టపై ప్లాట్లు ఏర్పాటు చేసి ఆవాసాలు నిర్మించుకునేలా మాపై ఒత్తిడి గురి చేసి ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఈ ఆవాసాల నిర్మించుకొని జీవించడానికి సాహసం చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మా ఆదివాసి కాలనీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కరెంటు సరఫరా అవ్వదు ఇంటింటికీ నల్ల కనెక్షన్ ఉన్న నీటి సరఫరా జరగదు, ఎలాంటి వ్యాధులకు గురైన వైద్య సౌకర్యం అందదు, ఇలా ఎందరో మార్గమధ్యంలోనే చనిపోయిన వారు ఉన్నారని, మా బతుకులు గాలికి దీపం పెట్టినట్టుగా ఏఎమ్మర్ కోల్ మైనింగ్ ప్రాజెక్టు నిర్వాహకంతో దుర్భరంగా జీవిస్తున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇలాంటి అలాంటి సమస్య ఉందని కంపెనీ నిర్వాహకులతో వేడుకున్న పాపమే వెంటనే మా పొట్ట మీద కొడతారు. ఇబ్బందులకు గురి చేస్తారు. కంపెనీలో రోజువారీ కూలి గా పనిచేసే వారిని ఎందరినో ఇలా తొలగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. మా ఇండ్ల స్థలాలు, పంట పొలాలు సర్వం ధారాదత్తం చేశాం. కానీ మాకు జీవనాధారం చూపించకుండానే మాకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని, మేము బతికేది ఎట్లా.? మాకు చిన్న పిల్లలతో పాటు చేతికందిన కొడుకులు కూతుళ్లు ఉన్నారు, మాకు బతుకు దెరువు చూపించి శాశ్వత సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని మా బతుకులకు ఎవరికి చెప్పుకోలేక ఐదు రోజులుగా దాహంతో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకునే వారు లేరని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివాసీ ప్రజలు విలవిల్లాడుతున్నారు.

వసతి కల్పించండి : కాపురం గ్రామస్తుడు తోట కిష్టయ్య

అయ్యా కలెక్టర్ సార్ మాకు నీటి సౌకర్యం, కరెంటు వసతి కల్పించండి. మాకు బతుకు దెరువు చూపించండి. మా ఇంటి స్థలాలు వ్యవసాయ భూములు కంపెనీ కోసం ధారధక్తం చేశాం. మా కడుపున పుట్టిన పిల్లలకు ఏఎమ్మర్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించండి సార్ అంటూ కలెక్టర్ ను వేడుకున్నారు. ఏఎమ్మర్ కంపెనీ పెద్ద సార్ అన్ని విధాల చూసుకుంటానని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు లేక వంట చేసుకోలేదు : మేకల లక్ష్మి కాపురం

ఐదు రోజులుగా నీళ్లు లేక స్నానం చేయలేదు. తాగునీరు లేక వంట చేసుకోలేదు. తాగడానికి తహతహలాడుతున్న గుక్కెడు మంచినీళ్లు ఇప్పించండి సార్ అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Similar News