ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : నవీన్ మిట్టల్

చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రధాన కార్యదర్శి

Update: 2024-06-29 11:20 GMT

దిశ,జనగామ: చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ధరణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, ధరణి దరఖాస్తులు ఇప్పటివరకు పూర్తైనవి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు, మండలాల వారీగా వచ్చిన ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వివిధ మాడ్యూల్స్, తదితర అంశాలను కలెక్టర్ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమావేశం నిర్వహించి, ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మిగితా ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి, సకాలంలో, వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, ఈ దరఖాస్తుల ప్రక్రియలో సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లను స్పష్టంగా అప్ లోడ్ చేయాలని, పెండింగ్ దరఖాస్తుల డేటా కరెక్షన్స్, కోర్టు కేసులు, సక్సెషన్, మ్యుటేషన్, తదితర మాడ్యుల్స్ ను పరిష్కరించి, వెంటనే డిస్పోజ్ చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు, ఈడీఎం దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News