త‌వ్వుకో..దోచుకో.. ఇసుక క్వారీల్లో అక్ర‌మాల‌కు అడ్డుకట్టేది..?

ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఇసుక క్వారీల్లో అక్ర‌మాలకు అడ్డు

Update: 2024-07-01 13:56 GMT

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఇసుక క్వారీల్లో అక్ర‌మాలకు అడ్డు లేకుండా పోతోంది. త‌వ్వుకో.. దోచుకో అన్న‌చందంగా మారిపోయింది. అద‌న‌పు బ‌కెట్‌తో ర‌వాణా సాగిస్తున్న లారీల‌ను అప్పుడ‌ప్పుడు ప‌ట్టుకుంటున్న పోలీసులు.. సీజ్ చేసి కేసులు న‌మోదు చేస్తున్నారు. అయితే అస‌లు అక్ర‌మాల‌కు పునాది లాంటి క్వారీల‌పై మాత్రం మైనింగ్ విజిలెన్స్ అధికారులుగానీ, పోలీస్‌, రెవెన్యూ అధికారులు గానీ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ర‌వాణాలో దొరికిన లారీల‌పై మాత్ర‌మే కేసులు న‌మోదు చేస్తున్న అధికారులు క్వారీ యాజ‌మాన్యాల‌పై మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. గ‌త రెండునెల‌ల కాలంలో అదన‌పు లోడుతో వెళ్తున్న‌ సుమారు 200ల‌కు పైగా లారీల‌ను ములుగు జిల్లా పోలీస్ అధికారులు సీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం. సీజ్ చేసిన లారీల్లో ములుగు జిల్లాలోని క్వారీల నుంచి ర‌వాణా చేస్తున్న వాహ‌నాల‌తో పాటు పొరుగు జిల్లా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌రిధి నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తున్న వాహ‌నాలు ఉన్నాయి.

అద‌న‌పు బ‌కెట్ దందా..!

ములుగు జిల్లాలో వాజేడు, నూగూరు వెంక‌టాపురం, ఏటూరునాగారం, మంగ‌పేట మండ‌లాల్లో ఇసుక క్వారీలున్నాయి. అలాగే భూపాల‌ప‌ల్లి జిల్లాలో మ‌హ‌దేవ‌పూర్‌, ప‌లిమెల మండ‌లాల్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోని క్వారీల నుంచి ల‌భ్య‌మ‌య్యే గోదావ‌రి ఇసుక‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో డిమాండ్ నెల‌కొంది. అయితే ప్రభుత్వం నిర్దేశింర్దేశించిన డీ.డీ.లకంటే అధికలోడుతో ఇసుకను త‌ర‌లింపు చేస్తున్నారు. టీజీఎండీసీ పేరుతో లారీ యజమానులు తమ వాహనాలపై చెల్లించిన సొమ్ముకు మించి ఐదు నుంచి ఆరు టన్నులు ఓవర్‌లోడ్ చేస్తున్నారు. ఇటీవ‌ల పోలీసులు, ర‌వాణాశాఖ అధికారుల త‌నిఖీల్లో ఈ విష‌యం రుజువైంది. ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాలోని తొమ్మిది క్వారీల నుంచి 700 లారీల్లో హైదరాబాద్‌కు రోజుకు సుమారు 17,100 టన్నుల ఇసుక రవాణా అవుతోంది. లారీకి 5,000 చొప్పున ఈ దోపిడీ మొత్తం దాదాపు రూ. రోజుకు 30 లక్షలకు పైగా దందా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. రాజ‌కీయ పార్టీ నేత‌ల‌ అండతో కాంట్రాక్టర్లు, అధికారులు సంయుక్తంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి.

ఇవిగో కొన్ని ప‌రిణామాలు..!

నూగూరు వెంక‌టాపురం మండ‌లం ఎదిర పంచాయతీ ఒంటి చింతలగూడెం ,మొర్రవాని గూడెం ర్యాంపుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన డీడీల కంటే మించి ఒక్కో లారీలో 4 నుంచి 5 టన్నుల ఇసుకను ర‌వాణా చేస్తున్న‌ట్లుగా పోలీసులు, అధికారులు కొద్ది రోజుల క్రితం గుర్తించారు. ఈ సంఘ‌ట‌న‌లో 11 లారీల‌ను సీజ్ చేసి వదిలేశారు. క్వారీ యాజ‌మాన్యంపై టీజీఎండీసీ అధికారులు క‌నీస‌ విచార‌ణ చేయ‌లేదు. 2024 మార్చి 17న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మ‌ల్హ‌ర్ మండ‌లంలోని ఇసుక క్వారీల నుంచి అక్రమంగా అనుమ‌తికి మించి ఇసుకను త‌ర‌లిస్తున్న నాలుగు లారీల‌ను కాటారం పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అలాగే ఇటీవ‌ల భూపాల‌ప‌ల్లి ఎస్పీ ఆదేశాల‌తో స్పెషల్‌ డ్రైవ్ చేప‌ట్టారు. భూపాలపల్లి, కొయ్యూరులో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో కాటారంలో 8, భూపాలపల్లిలో 5 మొత్తం 13 లారీలు ఓవర్‌లోడ్‌తో పట్టుబడ్డాయి. ఒక్కో లారీలో పరిమితికి మించి అదనంగా 10 టన్నులకు పైనే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 13 లారీలను సీజ్‌ చేసిన పోలీసులు లారీ డ్రైవర్లు, ఓనర్లపై కేసులు నమోదు చేశారు. కేవ‌లం ఇవి కొన్ని సంఘ‌ట‌నోదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో నిత్యం ప‌దుల సంఖ్య‌లో అద‌న‌పు లోడుతో వెళ్తున్న లారీలు ప‌ట్టుబ‌డుతున్న మైనింగ్ అధికారులు మాత్రం అక్ర‌మాల‌కు కార‌ణ‌మ‌వుతున్న క్వారీల యాజ‌మాన్యాల‌పై మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

Similar News