విద్యాశాఖ అధికారుల గైర్హాజరుపై మంత్రి శ్రీధర్ బాబు అసంతృప్తి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడం

Update: 2024-07-03 13:31 GMT

దిశ,మల్హర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంథని ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని వల్లెంకుంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గది ప్రారంభిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మంత్రి ముచ్చటిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ, పీజీ, బి ఈడి, టిటిసిలు చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి బోధించాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి మంత్రి సూచించారు. జిల్లా, మండల విద్యాధికారుల హాజరుపై ఆరా తీయగా గైర్హాజరు అయినట్లు తెలియడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసి ఉపాధ్యాయుల పనితీరుపై, విద్యార్థుల విద్యపై వారి పర్యవేక్షణ ఉందా లేదా ప్రతి పాఠశాల లో ఉపాధ్యాయుల హాజరు శాతంపై విద్యాశాఖ అధికారుల దృష్టి ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులను వెచ్చిస్తుందని, అదేవిధంగా అదనంగా తరగతి గదులను నిర్మాణాల కోసం నిధులు కేటాయించడం జరుగుతుందని అక్కడక్కడ పాతబడ్డ కొన్ని భవనాలను అమ్మ ఆదర్శ పథకంలో భాగంగా మరమ్మత్తులు చేయించి మాడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నామని ఊర్లో చదువు లేని విద్యార్థి ఉండకూడదు అనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్యసించేలా ఒకటి నుంచి పదవ తరగతి వరకు శిక్షణ పొందిన గురువులను సైతం నియమించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మళ్లీ చేపట్టబోయే డీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ పొందిన ఉపాధ్యాయులను ఖాళీగా ఉన్న ఆ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, 8 మంది ఉపాధ్యాయుల ఉన్నా 36 మంది విద్యార్థులు ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తూ బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదుకు చేపట్టిన చర్యల పై మంత్రి ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు.48 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేస్తున్నట్లు తెలపడంతో ఆనందంతో విద్యార్థులు మంత్రితో ఫోటోలు దిగారు బాగా చదువుకోవాలని ఆయన కితాబ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, జడ్పిటిసి ఐత కోమల రాజిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, జడ్పి సీఈవో విజయలక్ష్మి, డిఆర్డిఓ నరేష్, పంచాయతీరాజ్ ఈ ఈ దిలీప్, మండల ప్రత్యేక అధికారి అవినాష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బడితల రాజయ్య తోపాటు పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News