వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కీలక ప్రకటన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం.. గీసుకొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన వారికి తొలుత ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను సీఎం అదేశించారు. 1,200కు పైగా ఇళ్లను నిర్మిస్తే గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కైటెక్స్, యంగ్ వన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మెగా టెక్స్‌టైల్ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెక్స్‌టైల్ పార్కుకు సమీపంలో వచ్చే వరద నీటిని ఈ చెరువులోకి మళ్లించి వాటిని స్టోర్ చేయాలని సూచించారు. ఈ చెరువును స్థానికంగా ఉండే ఇతర చెరువులతో లింక్ చేయడం ద్వారా వరద నీటికి పరిష్కారంతో పాటు టెక్స్‌టైల్ పార్క్‌కు అవసరమైన నీటి లభ్యతను సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు.
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ సిబ్బందిని ఆయన పలకరించారు. ఈ టూర్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ, స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్షిస్తారు. హంటర్ రోడ్‌లో నిర్మించిన మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభించి సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
రేపు నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి
సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. ఇవాళ గుండెపోటుతో మృతిచెందిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం నిజామాబాద్ వెళ్లనున్నారు. కాగా డీఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.