నేడు వ‌రంగ‌ల్‌కు CM.. ఏర్పాట్లపై మంత్రులు సురేఖ‌, సీత‌క్క స‌మీక్ష

వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ప‌ర్యటించ‌నున్నారు

Update: 2024-06-29 01:59 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ప‌ర్యటించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో జిల్లాకు తొలిసారిగా వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటు ప్రభుత్వం య‌త్రాంగం, అటు పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లంలోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో జ‌రుగుతున్న ప‌నుల‌ను, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు కొత్తగాత్త నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను సీఎం స్వయంగా ప‌రిశీలించ‌నున్నారు. హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల ప‌రిధిలో, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపాలిటీ, కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ 2041 ఫైన‌ల్ త‌దిత‌ర అంశాల‌పై హ‌న్మకొండ జిల్లా క‌లెక్టరేట్ స‌మావేశ మందిరంలో మంత్రులు సురేఖ‌, సీత‌క్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీడ‌బ్ల్యూఎంసీ, కుడా అధికారుల‌తో క‌లిసి రివ్యూ నిర్వహించ‌నున్నారు. రివ్యూలో ప్రధానంగా ప‌ట్టణంలో అండర్ గ్రౌం డ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణం, అందుకు కావాల్సిన భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటూ వ‌స్తున్న మాస్టర్ ప్లాన్ – 2041 పైన చ‌ర్చించ‌నున్నారు.

ఏర్పాట్లపై మంత్రుల ఆరా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాల ప‌ర్యట‌న నేప‌థ్యంలో గురువారం మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారదా దేవి, ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో హ‌న్మకొండ క‌లెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం కు నివేదించనున్న పలు అంశాల పై సమావేశంలో చ‌ర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.

ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్‌..

శ‌నివారం మ‌ధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మ‌ధ్యాహ్నం 12:40 గంట‌ల‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లంలోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు మధ్యాహ్నం1:30గంట‌ల‌కు చేరుకుంటారు. దాదాపు 20నిముషాల పాటు పార్కును ప‌రిశీలించిన అనంతరం 1:50 కి అక్కడి నుంచి బ‌య‌ల్దేరి రోడ్డు మార్గంలో వ‌రంగ‌ల్ సెంట్రల్ జైల్ స్థానంలో నూత‌నంగా నిర్మిస్తున్న ఎంజీఎం సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ‌ద్దకు 2:10కి చేరుకుంటారు. అక్కడ‌20 నిముషాల పాటు భ‌వ‌నాల‌ను ప‌రిశీలించి నిర్మాణంపై అధికారులతో స‌మీక్షిస్తారు. అనంత‌రం 2:30కి అక్కడి నుంచి బ‌య‌ల్దేరి హ‌న్మకొండ క‌లెక్టరేట్‌కు చేరుకుంటారు. 2:45ల‌కు మ‌హిళా శ‌క్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. 3 గంట‌ల నుంచి 5:30గంట‌ల వ‌ర‌కు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపాలిటీ ప‌రిధిలో జ‌రిగే అభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క‌లెక్టర్లు, జీడ‌బ్ల్యూఎంసీ క‌మిష‌న‌ర్‌, మేయ‌ర్‌, కుడా అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వహించ‌నున్నారు. అనంత‌రం హంట‌ర్ రోడ్డులో నూత‌నంగా నిర్మిత‌మైన మెడి క‌వ‌ర్ ప్రైవేటు ఆస్పత్రి వ‌ద్దకు 5:40 గంట‌ల‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంత‌రం అక్కడి నుంచి 6:10గంట‌ల‌కు ఆర్ట్స్ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వ‌ద్దకు చేరుకుని హైద‌రాబాద్ బ‌య‌ల్దేరి వెళ్తారు.

Similar News