‘ఆకేరు’ ఆర్తనాదం..! రెచ్చిపోతున్న ఇసుకాసురులు

మహబూబాబాద్ జిల్లాలో తాగునీరు, సాగునీటికి ఆకేరువాగే జీవనాధారం. మరోవైపు ఆకేరు వాగు ఇసుక అక్రమార్కులకు వరంగా మారి కాసులు కురిపిస్తోంది.

Update: 2024-09-30 01:59 GMT

దిశ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లాలో తాగునీరు, సాగునీటికి ఆకేరువాగే జీవనాధారం. మరోవైపు ఆకేరు వాగు ఇసుక అక్రమార్కులకు వరంగా మారి కాసులు కురిపిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి జిల్లా కేంద్రాలకు రవాణా చేస్తున్నారు. నెల్లికుదురు, కొమ్ములవంచ, జయపురం, కౌసల్యదేవిపల్లి, ఉగ్గంపల్లి, చిన్నగూడూరు, బీచురాజుపల్లి గ్రామాల నుంచి రోజూ వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లలో రవాణా జరుగుతోంది. రాజకీయ నాయకుల మద్దతు, అధికారుల అండదండలతోనే ఇసుక రవాణా జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలతో నీటి నిల్వ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్‌లు వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. గతంలో చెక్‌డ్యాం సమీపంలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడంతో వర్షాలకు కౌసల్యదేవిపల్లి గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. భూగర్భ జలాలు సైతం అడుగంటి‌పోతున్నాయి. నర్సింహులపేట మండలంలోని ఆకేరు పరీవాహక ప్రాంతమైన కౌసల్యదేవిపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

రాత్రి అయితే చాలు.. ట్రాక్టర్లు రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొడుతున్నాయి. ట్రాక్టర్లకు పర్మిషన్, లైసెన్స్‌ ఉండదు. మైనర్లు సైతం ట్రాక్టర్లు నడుపుతూ.. ఇసుక తరలిస్తున్నారు. ఇప్పటికే రెండు ర్యాంపులను అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికులు సైతం పోలీసులకు సమాచారం ఇస్తే తమకు సంబంధం లేదనట్లుగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. మైనింగ్ అధికారులది ఇదే జవాబు. ఈ రెండు శాఖలు రెవెన్యూ శాఖ పేరు చెప్పి తప్పించుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో పోలీసు, రెవెన్యూశాఖ సమక్షంలో ఆకేరు సమీపంలో ట్రెంచ్ ఏర్పాటు చేసేవారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ రూ.లక్షలు ఆర్జిస్తున్న వారితో తిరుగుతున్న అధికారుల తీరు పట్ల గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 25 కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రకృతి సంపదను కొల్లగొట్టకుండా చూడాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నిద్రమత్తులో అధికారులు..

కౌసల్యదేవిపల్లి గ్రామంలో ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు నిద్రమత్తును వదలడం లేదు. నిల్వ చేసిన ఇసుక డంప్‌‌లను మాత్రం వెళ్లి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆకేరు వాగులోకి ఎన్ని ట్రాక్టర్లు వచ్చాయని మాత్రమే లెక్క పెట్టుకుంటాడు ఓ అధికారి. ఇసుక రవాణాకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూపు, ఆ గ్రూపులో అధికారులు సైతం ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. మైనర్లు ట్రాక్టర్లు నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నర్సింహులపేట మండలంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. పనులన్నీ అధికారుల ప్రైవేటు డ్రైవర్లు చక్కబెడుతున్నారు. నిఘా వ్యవస్థ కూడా నిద్రమత్తును వీడకపోవడం కొస మెరుపు.

ట్రెంచ్ కొట్టాలంటున్న గ్రామస్తులు..

ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలంటే గతంలో ర్యాంపుల దగ్గర బండ్లు వెళ్లకుండా ట్రెంచులు కొట్టేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పనిసరిగా అధికారులు ట్రెంచ్​ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇసుకాసురులు ఆకేరుకు లూఠీ చేస్తారని గ్రామస్తులు వాపోతున్నారు.


Similar News