చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత
మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత వేధిస్తోంది. చుట్టూ మూడు మండలాలైన చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండల ప్రజలకు అందుబాటులో ఈ ఆస్పత్రి ఒక్కటే ఉంది.
దిశ, చిట్యాల : మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత వేధిస్తోంది. చుట్టూ మూడు మండలాలైన చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండల ప్రజలకు అందుబాటులో ఈ ఆస్పత్రి ఒక్కటే ఉంది. ఆయా మండలాల ప్రజలతోపాటు, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల ప్రజలకు మినీ ఎంజీఎం మాదిరిగా వైద్య సేవలను అందిస్తుంది. ప్రారంభంలో 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని ప్రస్తుతం 50 పడకల ఆస్పత్రిగా మార్చారు. ఈ హాస్పిటల్ లో పరీక్షలు చేసేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు, ఆపరేషన్ థియేటర్, పుట్టిన శిష్యులకు ఇంటెన్సివ్ ప్లాంట్, ఎక్స్ రే వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆరంభంలో వైద్యులు అందుబాటులో ఉండి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వైద్యం అందించేవారు. ప్రజలకు ప్రైవేట్ దవాఖాన కంటే సర్కారు దవాఖానే నయం అనే నమ్మకాన్ని కలిగించింది. పేద ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలు, చుట్టూ ఉన్న ప్రజలతోపాటు, మండల, ఆయా జిల్లాల చుట్టు పక్కల ప్రాంతాల వరకు వ్యాప్తి చెందింది.
నిత్యం వైద్య సేవలు, ప్రసవాల కోసం క్యూ లైన్‌తో రద్దీగా ఉండేది. అటువంటి హాస్పిటల్ నేడు రోగులు లేక వెలవెలబోతుంది. ఓపీ రోగుల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వైద్యులు లేకపోవడంతో రోగుల సంఖ్య తగ్గిందనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక్కరోజులో అత్యధిక ప్రసవాలు చేసిన ఘనత జిల్లాలో ఈ ఆస్పత్రికి దక్కడం తో పాటు అవార్డులను సొంతం చేసుకుంది. కానీ నేడు స్త్రీ వైద్య నిపుణులు లేక అలంకారప్రాయంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో వచ్చిన వారిని, గర్భిణులను పరీక్షల కోసం, జిల్లా కేంద్రంలోని హాస్పటల్‌కు రిఫర్ చేయడం జరుగుతుంది. వైద్య సేవలు సరిగ్గా అందకపోవడంతో సీరియస్‌గా ఉన్న రోగులు దగ్గరలోని జమ్మికుంట, పరకాల, భూపాలపల్లి, హన్మకొండ వంటి ప్రాంతాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆశ్రయిస్తున్నారు.
డాక్టర్స్‌ను నియమించాలి..
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. నియమించిన డాక్టర్లు తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి వెళ్తున్నారు. కొంతమంది డాక్టర్స్ బదిలీ చేయించుకుని పట్టణ ప్రాంతానికి వెళ్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందాలంటే గ్రామీణ ప్రాంత రోగులకు డాక్టర్స్ కొరత లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, అనస్తీషియా, జనరల్ సర్జన్ వంటి ముఖ్యమైన పోస్టులు అత్యవసరంగా భర్తీ చేయాల్సి ఉంది. వీళ్లు లేకనే ఆయా వార్డుల గదులకు పేషెంట్లు లేక తాళాలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆస్పత్రి దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రిలో ఐదుగురు డ్యూటీ డాక్టర్లు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంబీబీఎస్ డాక్టర్లు డ్యూటీలను వారంలో మూడు రోజుల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఇంచార్జ్ సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించడంతో హాస్పటల్‌కు వచ్చే పేషెంట్లు రావడానికి సుముఖత చూపడం లేదు. వెంటనే అవసరమైన వైద్యులను నియమించి ప్రతిరోజు రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎమ్మెల్యే చొరవ చూపాలి..
పేద ప్రజలకు అవసరమైన బెడ్లు, గదులు, పరికరాలు ఉండి కూడా వైద్యులు లేక అవి ఉపయోగం లేకుండా మారుతున్నాయి. కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆకస్మికంగా హాస్పటల్లో తనిఖీలు చేస్తున్నా అవసరమైన వైద్యులను నియమించడం లేదని మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే చొరవ తీసుకుని వైద్యులను నియమించాలని వేడుకుంటున్నారు.