అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు…

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన అన్నారం బ్యారేజీలో గేట్ల వద్ద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదను దిగువకు వదులుతున్న క్రమంలో సరికొత్త సమస్య ఎదురైంది.

Update: 2024-10-03 13:26 GMT

దిశ, కాటారం: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన అన్నారం బ్యారేజీలో గేట్ల వద్ద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదను దిగువకు వదులుతున్న క్రమంలో సరికొత్త సమస్య ఎదురైంది. ఈ సారి సీజన్ లో వర్షాలు విడతల వారీగా పడడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద హెచ్చుతగ్గులు అవుతూ వచ్చింది. దీంతో భారీగా సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేయడంతో ఇరిగేషన్ అధికారులు సరి కొత్త సమస్యను ఎదుర్కొన్నారు. చివరకు తమ మేథకు పదునుపెట్టి సమస్యను పరిష్కరించారు.

అసలేం జరిగిందంటే...

గత సంవత్సరం అక్టోబరు 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి బ్యారేజీ నిర్మాణ లోపాలను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రాథమికంగా కొన్నింటిని గుర్తించిన NDSA బృందం బ్యారేజీలో నీటిని నిలువ చేయకుండా దిగువకు వదిలేయాలని సూచించింది. మేడిగడ్డకు ఎగువ భాగాన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఒకే డిజైన్ తో నిర్మించినందున వాటిలో కూడా బ్యాక్ వాటర్ నిలువ ఉంచకూడదని తేల్చిచెప్పింది. దీంతో కాళేశ్వరం ఇంజనీర్లు ఒక్క చుక్క నీరు కూడా నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో అన్నారం బ్యారేజీ లో సరికొత్త సమస్య ఎదురైంది. అన్నారం బ్యారేజీ ఎగువ భాగాన ఏకంగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేయడంతో ఇంజనీర్లను ఆందోళన కలిగించింది. అయితే ఈ ఇసుక మేటలు కేవలం బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలోనే కాకుండా బ్యారేజీ గేట్ల వద్ద కూడా ఏర్పడ్డాయి. దీంతో గేట్లను వేసే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం ఎలా అని ఇరిగేషన్ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు.

భారీ నష్టం...

బ్యారేజీ గేట్ల ప్రాంతాల్లో ఇసుక భారీగా వచ్చి చేరడంతో కేవలం గేట్లు వేసే పరిస్థితి లేకపోవడమే కాకుండా మరో ప్రధాన సమస్యను కూడా గుర్తించారు ఇంజనీర్లు. బ్యారేజీ గేట్ల వద్ద ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోవడం వల్ల బరువు కారణంగా కింది భాగంలో ఉన్న నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అధికారులు గమనించారు. సాధారణంగా వరద నీరు వచ్చి పోతున్నప్పుడు బ్యారేజ్ బెడ్ లెవల్ పై పడే వెయిట్ అంతంత మాత్రమే ఉంటుంది. కానీ ఇసుక మేటలు వేయడం వల్ల బరువు కారణంగా కాంక్రీట్ నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిని దీనివల్ల బ్యారేజీలో సరికొత్త సమస్యలు ఏర్పడేవి. ఇసుకను అలాగే ఉంచినట్లయితే బ్యారేజీ కిందిభాగంలోని బెడ్ తో పాటు కాంక్రీట్ నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గమనించిన ఇంజనీర్లు సమస్యను అధిగమించడం ఎలా అని తర్జనభర్జనలు పడ్డారు.

ఇసుకను టెండర్లు వేసి తొలగించాలంటే సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం అంతగా పడకుండా.. బ్యారేజీ దెబ్బతినకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన ఇసుకను దిగువకు పంపించాల్సిన ఆవశ్యకత ఉందని నిర్ణయించారు. ఇందుకోసం సుదీర్ఘంగా ఆలోచించిన అధికారులు అత్యవసరంగా ఇసుకను అక్కడి నుంచి తొలగించేందుకు సరికొత్త టెక్నిక్ ను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా అన్నారం బ్యారేజీ గేట్లు అన్నింటిని మూసి వేసి ఒక్కో గేటు ఓపెన్ చేస్తూ ఫ్లషింగ్ టెక్నిక్ విధానం ద్వారా వరద నీటిని అటుగా మళ్లించి గేట్ల కింద పేరుకపోయిన ఇసుకను దిగువకు పంపించడంలో సఫలం అయ్యారు. ఇదే విధానాన్ని అన్ని గేట్ల విషయంలోనూ అమలు చేయడంతో అన్నారం బ్యారేజీలో పేరుకపోయిన 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మొత్తాన్ని కూడా దిగువకు పంపించగలిగారు. లేనట్టయితే అటు బ్యారేజ్ బేస్ దెబ్బతినడంతో పాటు, గేట్లను కూడా మూసి వేసే అవకాశం ఉండకపోయేది.


Similar News