రేవంత్‌కు కూల్చుడు తప్ప.. కట్టుడు తెల్వదు : హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Update: 2024-10-04 09:59 GMT

దిశ, తొర్రూరు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా లోగా రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా బీఆర్‌ఎస్‌ వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో 10,000 మంది రైతులతో నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ, రైతుభరోసా, పంటలకు బోనస్‌ ధర ఇలా అన్ని విషయాల్లో రైతులను రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ, అవ్వ తాతలకు 4వేల పెన్షన్‌, అకచెల్లెళ్లకు రూ.2,500 సహా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ తాను సవాల్‌ చేసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే తనకు ముఖ్యమని చెప్పారు. ‘పంద్రాగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మొదట రూ.49 వేల కోట్లు అని, ఆ తర్వాత 31 వేల కోట్లు అని చెప్పి చివరకు మాఫీ చేసింది రూ.17 వేల కోట్లు. తొర్రూరు మండలంలోనే 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకుంటే ఐదువేల మందికే రుణమాఫీ అయింది. మరి.. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. కానీ ఒక బ్రోకర్..

రేవంత్ రెడ్డి నా శిష్యుడేనని.. కానీ రేవంత్ రెడ్డి బ్రోకరు మాటలు చెప్పి కేసీఆర్ ను ఓడించుండు... రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చాక ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. రైతులకు రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. రైతులకు సుమారుగా 50% కూడా రుణమాఫీ జరగలేదని అందుకే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి రైతులకు ఎటువంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నాలు చేపడుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ రైతులను మోసగిస్తూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కొనసాగలే.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు వెంటనే రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

హరీశ్‌కు గోడు వెల్లబోసుకున్న రైతులు..

తొర్రూరు పట్టణంలో నిర్వహించిన ధర్నాకు తరలివచ్చిన రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. ఆయా రైతులకు రుణం ఎంత ఉన్నది ? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ? రుణమాఫీ కాకపోవడానికి అధికారులు ఏం చెప్తున్నారు ? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ కోసం ఎవరెవరి వద్దకు ఎలా తిరిగామో రైతులు హరీశ్‌రావుకు వివరించారు. ‘మేమంతా రుణమాఫీ కానోళ్లం సార్‌.. పంట కోతకు వచ్చింది కానీ రైతుబంధు పడలేదు. కేసీఆర్‌ సార్‌ ఉన్నప్పుడు రైతుబంధు మంచిగా ఇచ్చిండు. రేవంత్‌ మాటలకు మోసపోయాం. రుణమాఫీ అయ్యేంత వరకు కొట్లాడుదాం. దసరా వరకు మాఫీ చేయకపోతే సచివాలయంకు వస్తాం.. మాఫీ అయ్యేంత వరకు అక్కడే ఉంటాం’ అని రైతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.


Similar News