Minister : సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-01 12:54 GMT

దిశ, వరంగల్ : బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరీమాబాద్ ప్రాంతంలోని రంగలీల మైదానంలో (ఉర్సు గుట్ట) సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద దేవి, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే లతో కలిసి సమీక్షించి సమర్ధ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ జరుపుకుంటామని, వారి సౌకర్యార్థం అవసరమగు అన్ని ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ జరుపుకునే అన్ని ప్రాంతాల వద్ద మైదానం చదును చేసి, రహదారిపై గుంతలు పూడ్చాలని, డస్టింగ్, లైటింగ్, మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలతో పాటు చెరువులలో గుర్రెపు డెక్క తొలగించాలని, ఆయా పనులు వేగవంతంగా చేపట్టి బుధవారం నాటికి పూర్తి చేయాలన్నారు. బతుకమ్మ ఆట స్థలాల వద్ద ప్రతిరోజు శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను సూచించారు.

దసరా పర్వదినం సందర్భంగా రంగలిలా మైదానంలో అంగరంగ వైభవంగా జరుపుకొనే వేడుకలకు దసరా కమిటీ కోరిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తగినంత లైటింగ్ పారిశుద్ధ్యం మంచినీటి సౌకర్యం, సీటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, మహిళ, పురుష పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు, సిసి కెమెరాల ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నగరం నలుమూలల నుండి ప్రజలు వచ్చేలా టిఎస్ ఆర్టిసి ద్వారా బస్సుల ఏర్పాటు, పార్కింగ్, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, అగ్నిమాపక యంత్రం ఏర్పాటు, ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన అంతర్గత రహదారులలో గుంతలను పూడ్చాలని, ఏలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అంకిత భావంతో ఏర్పాట్లు చేయాలని మంత్రి కోరారు.

అనంతరం నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ… అనుభవజ్ఞులైన అన్ని విభాగాల అధికారుల సహకారంతో పండుగల ఏర్పాట్లను విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆయా విభాగాలతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి విజయవంతం చేయడానికి తగు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ వరకు గుర్రపు డెక్క సకాలంలో తొలగింపుతో పాటు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుటకు జీడబ్ల్యూఎంసీ ముందుకు వెళుతునన్నదని అన్నారు. మంత్రి సూచన మేరకు బల్దియా తరపున చేపట్టవలసిన కార్యక్రమాలను సమీక్షించుకొని ఏమైనా అసంపూర్తిగా మిగిలియున్న పనులు ఉంటే కమిషనర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారని బల్దియా తరఫున అదనపు ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర పరిధిలోని చెరువుల వద్ద చేయాల్సిన ఏర్పాట్ల గురించి కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతంగా పూర్తి చేయుటకు అధికారులకు సూచనలు చేశారని మేయర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ …సద్దుల బతుకమ్మ దసరా నిర్వహించుకొనుటకు శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. బల్దియా సంబంధిత శాఖల అధికారులతో ఆయా పనులు త్వరితంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ… వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుటకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భారీ వాహనాలు ప్రధాన రహదారిపై రాకుండా మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ రవి, డిసిపి సలీమా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, అదనపు కమిషనర్ రాజేందర్ రెడ్డి, పోలీస్, ఇరిగేషన్ ఎన్పీడీసీఎల్, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, తదితర శాఖల అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు సంజయ్, గుండు పూర్ణచందర్, మధుసూదన్, రాం మూర్తి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


Similar News