వరంగల్ కాంగ్రెస్ నేతకు షాక్..గన్మెన్ల తొలగింపు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, నవీన్‌రాజ్‌కు ఉన్న ఇద్దరు గన్మెన్లను కమిషనరేట్ పోలీసులు బుధవారం తొలగించారు.
దిశ, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, నవీన్‌రాజ్‌కు ఉన్న ఇద్దరు గన్మెన్లను కమిషనరేట్ పోలీసులు బుధవారం తొలగించారు. దీంతో గన్మెన్లు హెడ్ క్వార్టర్ ఏఆర్ విభాగంలో రిపోర్ట్ చేశారు. నవీన్‌రాజ్ పై ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్ పై నవీన్‌రాజ్ దురుసుగా ప్రవర్తించడం, పదుల సంఖ్యలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందడం, ఏకంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో గన్మెన్లను ఉంచాలా వద్దా అనే అంశాలపై పోలీసులు విచారణ జరిపి అవసరం లేదని నిర్ధారించుకున్న తర్వాత తొలగించినట్లు తెలుస్తుంది. తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నవీన్‌రాజ్‌కు గన్మెన్లను తొలగించారు.