తుడుందెబ్బ, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు ధర్నా..
ఏజెన్సీలోని 5 వ షెడ్యూల్ పరిధిలో ఆదివాసి చట్టాలు నీరుకారుతున్నాయని, చట్టాల పరిరక్షణ, ఉద్యోగాల భర్తీ కై ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన మాట నెరవేర్చాలని లేదంటే దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కూమార్ అన్నారు.
దిశ, ఏటూరునాగారం : ఏజెన్సీలోని 5 వ షెడ్యూల్ పరిధిలో ఆదివాసి చట్టాలు నీరుకారుతున్నాయని, చట్టాల పరిరక్షణ, ఉద్యోగాల భర్తీ కై ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన మాట నెరవేర్చాలని లేదంటే దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కూమార్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యలయం ఏదుట తుడుందెబ్బ, ఆదివాసి సంఘాలు దర్నా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఏటూరునాగారం వై జంక్షన్ ప్రధాన కూడలి వద్ద నుండి ఐటీడీఏ వరకు ఆదివాసి సంఘాలు, తుడుందెద్బ నాయకులు రాస్తా రోకో నిర్వహించి ఐటీడీఏ ముందు బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కూమార్ మాట్లడుతూ ఐటీడీఏ పరిధిలోని 5వ షెడ్యూల్ లో ఆదివాసీల చట్టాలు అమలు చేయడంలో అధికారులు విఫలమౌతున్నారని, ఎన్నికల సమయంలో ఆదివాసి సంఘం ముఖ్య నాయకులు మంత్రి సీతక్కతో కలిసి రేవంత్ రెడ్డితో సమావేశమై ఆదివాసి హక్కుల రక్షణ, ఏజెన్సీ డీఎస్సీ, పేసా చట్టాలను అమలు చేసింది కాంగ్రేస్ పార్టీయేనని నమ్మబలికి మా మద్దతు తీసుకున్నారన్నారు.
మా ప్రాంతంలో విద్యార్థులకు అధికారులు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా టీఎస్ పీఎస్సీ ద్వారా జనరల్ ఇవ్వడంతో వారికి రావలసిన ఏజెన్సీ వాటా కూడా 100 పోస్ట్ లలో 6 మాత్రమే వస్తున్నాయన్నారు. సీతక్క ఒక ఆదివాసి బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 10 మంది ఎమ్మెల్యేలతో ట్రైబల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేక ఏజెన్సీలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడి ఆగమౌతున్నారని వేడుకొన్నారు. మెగా డీఎస్సీ వారికి అవసరం లేదని, ఏజెన్సీ డీఎస్సీ వారికి కెటాయించాలని కోరారు. ఇటీవల కాలంలో ఆదివాసీల పై రెడ్డీలు, వెలమ కులస్థులు రాడ్ లతో భౌతిక దాడులు చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఏజెన్సీ చట్టాలను అమలు చేసి అధికారులు ఆదివాసీలకు అండగా ఉండాలని ధర్నా చేపట్టామన్నారు. నెలరోజుల గడువులో మంత్రి సీతక్క ఆదివాసీలకు న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో 31 వ రోజు నుండి ప్రభుత్వం పై, సీతక్క పై బలమైన ఉద్యమ కార్యాచరణ చేపడతామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్రాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసిలు, ఆదివాసి సంఘా నాయకులు, తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గోన్నారు.