వరదముంపు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. కలెక్టర్ దివాకర టీఎస్

వర్షాకాలంలో వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు.

Update: 2024-06-18 12:26 GMT

దిశ, ఏటూరునాగారం : వర్షాకాలంలో వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. మంగళవారం ఏటూరు నాగారం మండలంలోని కొండాయి వరద ముంపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత వర్షాకాలంలో జరిగిన ఘటనలు పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, వరదల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గత వర్షాకాలంలో జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న కొండాయి గ్రామంలోకి వరద నీరు ఏ విధంగా వచ్చింది, ప్రవాహ ఉధృతి ఏ మేరకు ఉంది అనే అంశాలను స్థానిక తహశీల్దారును అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, గ్రామస్తులు సహకరిస్తే అన్ని సమస్యలు పరిష్కరించడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. 35 లక్షల రూపాయల నిధులతో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కొండాయి వంతెన పై జరుగుతున్న తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల తహశీల్దార్ జగదీశ్వర్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Similar News