బీఆర్ఎస్‌ వర్సెస్ కాంగ్రెస్.. న‌యీంన‌గ‌ర్ బ్రిడ్జి నిర్మాణ క్రెడిట్ కోసం పార్టీల సవాళ్లు

హ‌న్మకొండ న‌యీంన‌గ‌ర్ బ్రిడ్జి నిర్మాణాభివృద్ధి క్రెడిట్ కోసం బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ కొన‌సాగుతోంది.

Update: 2024-10-01 02:41 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: హ‌న్మకొండ న‌యీంన‌గ‌ర్ బ్రిడ్జి నిర్మాణాభివృద్ధి క్రెడిట్ కోసం బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ కొన‌సాగుతోంది. బ్రిడ్జి తమ హయాంలోనే మంజూరు చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై కాంగ్రెస్ నేతలు భ‌గ్గుమంటున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్ మ‌ధ్య నాలుగు రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. స‌వాళ్లు, ప్రతిస‌వాళ్లతో సోమ‌వారం ఉద‌యం న‌యీంన‌గ‌ర్ బ్రిడ్జిపైకి చేరుకున్న బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య తోపులాట‌ చోటుచేసుకున్నాయి. నయీంనగర్ వంతెన వద్దకు ఒక్కసారిగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వంతెనను తామే అభివృద్ధి చేశామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నయీంనగర్‌ నాలా వంతెన అభివృద్ధి పనులు మేం చేశామంచే మేం చేశామంటూ ఇరు పార్టీల శ్రేణులు వాగ్వాదానికి దిగారు. కేసీఆర్‌ పాలనలో తామే అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు నినాదాలు చేస్తే, కాంగ్రెస్‌ అభివృద్ధి చేసిందని హస్తం నేతల మ‌ధ్య వాదోప‌వాదాలు న‌డిచాయి. ఇరు పార్టీల నేతల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వంతెన వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. అనంతరం బీఆర్ఎస్ నేత వినయ్‌భాస్కర్, సుందర్‌ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో బీఆర్ఎస్‌ నేతలు పోలీస్‌ వాహనాన్ని అడ్డుకునే ప్రయ‌త్నం చేయ‌డంతో చాలాసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది.

ద‌మ్ముంటే చ‌ర్చకు రా.. కేటీఆర్‌కు నాయిని స‌వాల్‌

నయీంనగర్ బ్రిడ్జిని పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించామని, దీనిపై చ‌ర్చించేందుకు తాను న‌యీంన‌గ‌ర్ బ్రిడ్జిపై వేచి ఉంటాన‌ని, ద‌మ్ముంటే కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు రావాలంటూ నాయిని స‌వాల్ విసిరారు. నయీంనగర్ బ్రిడ్జిని మేం నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లు తామే నిర్మించామని పుష్పాభిషేకం చేసుకుంటున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని స‌వాల్ విసిరారు. చెప్పిన‌ట్లుగా ఆదివారం ఉదయం 10 గంటలకు నయీంనగర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేత‌లు రాక‌పోవ‌డంతో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజ‌మెత్తారు. కేటీఆర్ ఇక్కడకు వచ్చి తమ సవాల్‌ను స్వీకరించి నిజాలు తెలుసుకోవాలని, స్థానికులతో మాట్లాడాలని, లేదంటే తాను చేసిన వ్యాఖ్యలు త‌ప్పు అని ఒప్పుకుని చీర, గాజులు తీసుకుని వెళ్లాలంటూ సూచించారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల‌కు బీఆర్ఎస్ నేత‌లు సైతం తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ ప‌రిణామంతో హ‌న్మకొండ రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడి పుట్టింది. రెండు పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ పీక్స్‌కు చేరుకుంది.

నయీంనగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత ..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరిన నేపథ్యంలో సోమవారం వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ నయీమ్ నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బ్రిడ్జి వద్దకు చేరుకుని దాస్యం వినయ్‌భాస్కర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు‌చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్, రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల తీరు పైన దాస్యం వినయ్‌భాస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తూ నయీం నగర్ బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు.


Similar News