ఈ నెల 3వ తేదీ నుంచి భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

ఓరుగల్లు శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయని మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.

Update: 2024-10-01 16:07 GMT

దిశ, వరంగల్ : ఓరుగల్లు శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయని మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈనెల 3వ తేదీన ధ్వజారోహణం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. 3వ తెదీన అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని, 4వ తేదీ రోజున అన్నపూర్ణా అలంకరణ, 5వ తేదీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం, 7వ తేదీ రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారంలో, 8వ తేదీ భవాని అలంకారం, 9వ తేదీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ భద్రకాళి మహాదుర్గ అలంకారంలో, 11వ తేదీ మహిషామర్ధిని అలంకారణలో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. అలాగే 12వ తేదీ విజయదశమి సందర్భంగా విశేష పూజలు చేసి శ్రీ భద్రకాళి అమ్మవారికి జల క్రీడోత్సవం హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. భద్రకాళి దసరా మహోత్సవంలో భాగంగా ఆఖరి రోజు 13వ తేదీ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.


Similar News