Collector : సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మీడియా సమావేశం నిర్వహించారు.
దిశ, జనగామ: జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను చేపట్టిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటి జాబితా రూపొందిస్తున్నామన్నారు.ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఈ సర్వేకు నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, పర్యవేక్షణ అధికారిగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ లు వ్యవహరిస్తారన్నారు.
ఈ సర్వే పట్ల జిల్లా యంత్రాంగం ఎంతగానో శ్రమిస్తోందన్నారు. ఈ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, అందుకోసం మూడంచెల పర్యవేక్షణ టీమ్ లను నియమించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్, పది మంది ఎన్యుమరేటర్ లకు ఒక సూపర్వైజర్, అలాగే మండల ప్రత్యేక అధికారులను జిల్లా స్థాయి నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. అదే విధంగా జిల్లాలో పది శాతం రిజర్వ్ తో 1156 ఎన్యుమరేటర్ లు, 116 సూపర్వైజర్ లు, 12 మంది మండల ప్రత్యేక అధికారులు, మున్సిపాలిటీ లో మొత్తం 30 వార్డులకు ఐదుగురు ప్రత్యేక అధికారులను కేటాయించామని వివరించారు. ప్రతి ఇంటికి స్టికర్ లు తప్పనిసరిగా అతికిస్తామన్నారు. ఎన్యుమెరేటర్ లకు, సూపర్వైజర్ లకు శిక్షణ ఇచ్చామని, బుధవారం 65,064 కుటుంబాలను సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు.
ఇందులో భాగంగా పార్ట్-1 లో కుటుంబ యజమానికి సంబంధించిన కులం, మొబైల్ నంబర్, విద్య, ఉపాధి, కులవృత్తులు, ఆదాయం, పన్ను, భూములు, బ్యాంకు ఖాతాలు, విద్య, ఉపాధిలో పొందిన రిజర్వేషన్, పొందిన పథకాలు, రాజకీయ నేపథ్యం, వలసలు ఇలా వివరాలు సేకరిస్తామని అన్నారు.పార్ట్-2 లో కుటుంబ వివరాలకు సంబంధించిన పొందిన రుణాలు, వ్యాపారాలు, నివాసం, స్థిర, చరాస్తి, తదితర వివరాలను సేకరిస్తామని, జిల్లా ప్రజలందరూ రేషన్, ఆధార్, ధరణి, పొలిటికల్ కు సంబంధించిన పత్రాలను మాత్రమే చూస్తామని, ఎటువంటి ప్రలోభాలకు గురికావొద్దని, ప్రజల వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని, స్వేచ్ఛగా తమ వివరాలను తెలపాలని కోరారు. అదే విధంగా ప్రజల్లో అపోహలను తొలగించి, చైతన్యపరచాలని, తమకు సహకరించాలని పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పల్లవి, అదనపు పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ రావు, పాత్రికేయులు పాల్గొన్నారు.