MLA శంకర్ నాయక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఎన్నికల వేళ మానుకోట‌లో అదుపు త‌ప్పుతున్న ‘కారు’..!

మానుకోట‌లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి శంక‌ర్‌నాయ‌క్ క‌ల‌లు క‌లలుగా మారేట్లుగా క‌నిపిస్తున్నాయి. మానుకోట నియోజ‌క‌వ‌ర్గ ప్రజానీకం

Update: 2023-11-17 04:53 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: మానుకోట‌లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి శంక‌ర్‌నాయ‌క్ క‌ల‌లు క‌లలుగా మారేట్లుగా క‌నిపిస్తున్నాయి. మానుకోట నియోజ‌క‌వ‌ర్గ ప్రజానీకం నుంచి ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌పై వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వేళ.. ఆ పార్టీ మండ‌ల స్థాయి నేత‌లు, ప్రజా ప్రతినిధులు వ‌రుస‌గా దూర‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ త‌మ‌ను ఐదేళ్లలో ఎప్పుడూ ప‌ట్టించుకోలేద‌ని కొంత‌మంది, ప్రాధాన్యం లేద‌ని మరికొంత‌మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌స్తున్న ఆహ్వానాలు ఇలా వివిధ కార‌ణాల‌తో క్షేత్రస్థాయిలోని లీడ‌ర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.

దీంతో శంక‌ర్‌నాయ‌క్ విజ‌యావ‌కాశాల‌కు గండిప‌డుతోంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. నెల్లికుదురు మండ‌లం వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన అనుచరుల‌తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే గూడూరు మండలానికి చెందిన సీనియర్ నాయకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చల్లా లింగారెడ్డి, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు పానుగంటి వీరస్వామి హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ ప్రవర్తన నచ్చక ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చ‌ల్లా లింగారెడ్డి ప్రక‌టించ‌డం గ‌మ‌నార్హం. అస‌మ్మతి నేత‌ల‌ను దారికి తెచ్చుకోవ‌డంలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ వైఫ‌ల్యం చెందాడ‌ని, వారికి గ‌తంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చక‌పోవ‌డ‌మే ఆయ‌న‌పై వారికి న‌మ్మకం కుదర‌క‌పోవ‌డానికి ప్రధాన కార‌ణ‌మ‌ని కూడా గుర్తు చేస్తున్నారు. స్వత‌హాగా ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌పై ఉన్న వ్యతిరేక ప‌వ‌నం కూడా నేత‌లు పార్టీని వీడేందుకు కార‌ణ‌మ‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది.

ప్రచారంలోనే తేలిపోతున్న శంక‌ర్‌నాయ‌క్‌..

స్వప‌క్షంలోనే విప‌క్షం అన్నట్లుగా కొంత‌మంది కీల‌క నేత‌లు పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితికి శంక‌ర్‌నాయ‌క్ చేసుకున్న స్వయం కృత‌ప‌రాధాలు కొన్ని, పార్టీలో స‌మీకర‌ణాలు మ‌రికొన్నంటూ పేర్కొంటున్నారు. దీంతో శంక‌ర్‌నాయ‌క్ ప్రచారం పేల‌వంగా సాగుతోంద‌ని ఆ పార్టీకి చెందిన నేత‌లే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా చాలా ముందుగానే ప్రచారం మొద‌లుపెట్టిన శంక‌ర్‌నాయ‌క్‌కు అనుకున్న విధంగా ప్రజ‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేద‌న్న స‌మాచారం అధిష్టానం దృష్టికి సైతం వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ మేర‌కు పార్టీ గైడ్ చేస్తున్నా.. పార్టీ అధిష్టానం నిర్ణయాల‌ను సైతం ఆయ‌న పాటించ‌క‌పోవ‌డంతోనే ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పే స్థితికి చేరుకున్నట్లు కీల‌క నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ త‌మ‌ను ఏమాత్రం లెక్క చేయ‌ని విధంగా వ్యవ‌హ‌రించారంటూ ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌రావు, మంత్రి స‌త్యవ‌తి రాథోడ్, ఎంపీ క‌విత వ‌ర్గీయులు పార్టీ ప్రచారంలో ఇన్వాల్వ్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News