ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై సర్కారు ఫోకస్.. అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లను గుర్తించే అవకాశం!

‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి వ్యవహారాలను పరిశీలిస్తే ప్రభుత్వ, దేవాలయాల, భూదాన్, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మార్చడం కావొచ్చు, అనేక దురాగతాలు, దుర్మార్గాలు అనేకం జరిగాయి.

Update: 2024-12-24 14:02 GMT

‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి వ్యవహారాలను పరిశీలిస్తే ప్రభుత్వ, దేవాలయాల, భూదాన్, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మార్చడం కావొచ్చు, అనేక దురాగతాలు, దుర్మార్గాలు అనేకం జరిగాయి. సమగ్ర భూ రికార్డుల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ధరణి ముందుగా TerraCIS, IL&FS అనే కంపెనీలకు అప్పగించారు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మారుతూ విదేశీ కంపెనీలకు చేతుల్లోకి మారింది. టెర్రాసిస్ అనే కంపెనీ నుంచి మొదలై ఐఎల్ఎఫ్ఎస్, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు చెందిన Falcon SG కి ఎలా వెళ్లింది? తిరిగి అక్కడి నుంచి Falcon Investments కు ఎలా చేతులు మారింది? ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షేర్లు మారుతూ ఫాల్కన్ ఎస్జీ నుంచి స్పారో ఇన్వెస్ట్‌మెంట్స్, జీడబ్ల్యూ స్కై, హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, పారాడిగమ్ ఇన్నొవేషన్స్స్, క్వంటెలా ఇన్‌కార్పొరేషన్.. ఇలా ఒక దాని నుంచి చేతులు మారాయి. ఈ కంపెనీలు టాక్స్ హెవెన్ దేశాలైన కేమన్ ఐల్యాండ్స్, బ్రిటిష్ ఐలాండ్స్ లాంటి దేశాల్లో ఉన్నాయి. అంటే 1.50 కోట్ల ఎకరాల భూముల డేటా, కోట్ల మంది ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, పాన్ కార్డుల డేటా.. అంతా దేశం దాటిపోయింది. ఆ కంపెనీల చేతుల్లో ఉన్నప్పుడే అర్ధరాత్రి కూడా ట్రాన్సక్షన్స్ జరిగాయి. వీటన్నింటి నిగ్గు తేల్చేందుకు పోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తాం’. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. = శిరందాస్ ప్రవీణ్ కుమార్

అర్ధరాత్రి లావాదేవీలు..

ఇప్పుడీ ‘ఫోరెన్సిక్ ఆడిటింగ్’ పై ఆసక్తి నెలకొన్నది. ధరణి పోర్టల్‌ని అడ్డంపెట్టుకొని లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ధరణిలో అప డేట్స్ సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే జరగడానికి అవకాశం ఉంది. కానీ రాత్రి 12 గంటల తర్వాత ఎందుకు జరిగాయి? ఆ టైంలో లావాదేవీలు ఎవరు చేశారు? సహకరించిన తహశీల్దార్లు, కలెక్టర్లు ఎవరు? అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఆఫీసుల్లోనే అయ్యాయా? ఎవరి ఇంట్లో కూర్చొని చేశారు? ఫామ్ హౌజ్‌ల్లో కూర్చొని డిజిటల్ సంతకాలు పెట్టారా? రాత్రి పూట నిషేధిత జాబితాలో నుంచి తొలగించడం, పేర్లు మార్చడం.. తిరిగి పీవోబీ జాబితాలో చేర్చడం వంటి దందాలు చాలా జరిగాయని ట్రాన్సాక్షన్ హిస్టరీనే చెబుతున్నది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అక్రమార్కుల గుట్టు అందరికీ తెలిసే అవకాశం ఉంది. వారం రోజుల నుంచి రెవెన్యూ వర్గాల్లో ఈ ఆడిట్ ఎలా ఉంటుంది? ఎవరు చేస్తారు? ఎవరెవరి బాగోతాలు బయటపడుతాయి? అంటూ చర్చ జోరుగా నడుస్తున్నది. ప్రభుత్వం థర్డ్ పార్టీ చేతికి ఇస్తుందా? ఇంటర్నల్‌గానే డిపార్ట్‌మెంట్ లో టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో చేయిస్తారా? అనేది బయటికి రాలేదు. కానీ ఎవరు చేసినా ప్రతి పేరు మార్పు, క్లాసిఫికేషన్ చేంజ్, ట్రాన్సక్షన్ హిస్టరీని సులువుగానే తెలుసుకునే వీలుందని నిపుణుల అభిప్రాయం.

డిజిటల్ ఫుట్‌ప్రింట్స్

మొబైల్ చేతిలో ఉంటే ఏ రోజు ఎక్కడికి వెళ్లారు? ఎంతసేపు ఉన్నారు? ఏమేం బ్రౌజ్ చేశారో తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ వినియోగంతో ఇంటర్నెట్ ప్రపంచం నడుస్తున్నది. ప్రతి కదలిక అప్ లోడ్ అవుతుంది. ఒక్క ఫొటో తీసుకుంటే లొకేషన్ తో పాటు ట్రేస్ చేసే వీలవుతుంది. పన్ను చెల్లింపులు, ఆన్ లైన్ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ, ప్రయాణాలు, సందర్శనలు, ఇలా ప్రతీది అందరికీ తెలిసిపోతుంది. ఆధార్, మొబైల్ నంబర్ వినియోగం వివరాలు కూడా నమోదు అవుతున్నాయి. వాటినే సాంకేతిక పరిభాషలో ‘డిజిటల్ ఫుట్ ప్రింట్స్’ అంటారు. వాటికి సంబంధించిన డేటా మొత్తం సేకరించి, కొన్ని కంపెనీలు వాటి లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించడాన్నే ‘బిగ్ డేటా’ అంటున్నారు. వ్యక్తిగతమైన, సున్నితమైన డేటాని అత్యంత భద్రంగా ఉంచడం, దాన్ని టాంపర్ చేయకుండా, ప్రతి కమాండ్ డేటా ప్రాసెసింగ్ వివరాలు ఒకదాని వెనక మరొకటి కాల క్రమంలో, వరుసగా ఆటోమేటిక్‌గా బ్లాక్‌ల రూపంలో అమర్చడానికి ఉపయోగించేదే ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’. ఇందులో రికార్డు సవరణంతా రియల్ టైమ్ లో జరుగుతాయి. అందుకు వేర్వేరు ప్రాంతాల్లో సర్వర్లు నెలకొల్పుతారు. ఫలితంగా సహజ విపత్తుల నుంచి సర్వర్లకి భద్రత.. అదే విధంగా అందులోని బ్లాకుల రూపంలో ఉన్న డేటాని ట్యాంపర్, హ్యాకింగ్ చేయడం ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఏదైనా ఒక సర్వరులో డేటా భద్రత ప్రమాదంలో పడినా ఇతర సర్వర్లు ఉపయోగించి వాటిని పునరుద్ధరిస్తారు.

ధరణి ట్రాన్సాక్షన్ హిస్టరీ

బ్యాంకింగ్ రంగం, ఇతర ఆన్ లైన్ భద్రతా వ్యవస్థలు, ఎయిర్‌లైన్స్.. ఇలా అన్ని ఇదే సాంకేతికతని వినియోగిస్తున్నాయి. ఇదే టెక్నాలజీతో “ధరణి” పోర్టల్ ద్వారా రైతుల భూముల లావాదేవీల నిర్వహణలో వినియోగిస్తున్నారు. ఇలా పట్టా మార్పిడి చేసే క్రమంలో అందులో భాగస్వాములు అయ్యే ప్రతి వ్యక్తి అంటే.. లావాదేవీలు చేసే క్రయ విక్రయాదారులు మొదలుకొని.. తహశీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్, తహశీల్దార్, కలెక్టర్, ధరణి జిల్లా కోఆర్డినేటర్, సీసీఎల్ఏ వరకు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఐపీ అడ్రస్‌ను వినియోగించారన్న లెక్క తెలుసుకోవచ్చు. ‘ధరణి’ పోర్టల్ డేటాని యాక్సెస్ చేయాలని ప్రయత్నించినా, డిజిటల్ సిగ్నేచర్ చేసినా, తొలగించినా.. అందుకు యత్నించిన వారి వివరాలు “డిజిటల్ ఫుట్ ప్రింట్స్” అన్నీ ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’ అనే ఆప్షన్ కింద నమోదు అవుతాయి. ఈ క్రమంలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయనుకున్న ప్రతి ధరణి ట్రాన్సాక్షన్ హిస్టరీని ట్రేస్ చేయొచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేయడం ద్వారా ఆ అక్రమాలకు పాల్పడిన వారి పూర్తి వివరాలు బయట పడుతాయి. ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ, ధరణి ఏజెన్సీ నిర్వాహకులు.. ఎక్కడెక్కడో వేర్వేరు సమయాల్లో లోపాయికారిగా డిజిటల్ సంతకం చేసినా లెక్క తేలుతుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ వివరాలు వెలికి తీసి సరి చూడడాన్ని ‘ఫోరెన్సిక్ ఆడిటింగ్’ అంటారు. ఈ వివరాలు నేర నిర్ధారణ ప్రక్రియలో మరియు కోర్టుల్లో సాక్ష్యాధారాలుగా కూడా చెల్లుబాటు అవుతాయి. ఈ డేటా ఆధారంగానే దేశంలో పలు ప్రాంతాల నుంచి ధరణి రికార్డులో ఇష్టారాజ్యంగా పట్టా మార్పిడులు చేశారని భూ భారతి-2024 బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అక్రమార్కుల్లో భయం

ధరణి వచ్చిన తర్వాత తహశీల్దార్ ఆఫీసుల్లో ఫిజికల్ రికార్డులు లేవు. ధరణి పోర్టల్ లో రియల్ టైమ్ డేటా మాత్రమే ఉంది. అందుకే కొందరు అధికారులు తాము చేసిన తప్పుడు పట్టా మార్పిడుల చిట్టా బయట పడదని ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి ఐపీ అడ్రసులు, డిజిటల్ సంతకాల డిజిటల్ ఫుట్ ప్రింట్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం వల్ల.. ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడానికి అవకాశం ఉండటంతో ఇక నుంచి అక్రమార్కుల్లో భయం పట్టుకున్నది. తాము చేసిన తప్పులు ఇతరులపైకి నెట్టేసి చేతులు దులుపుకునే అవకాశం లేకుండా పోయింది. దొడ్డి దారిన పట్టా మార్పిడి జరిగిన రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, కాందిశీకుల, భూదాన్, సీలింగ్, సర్ఫేఖాస్ భూముల వివరాలు వెలుగులోకి రానున్నాయి. ప్రధానంగా రూ.కోట్ల విలువైన భూములు పట్టా మార్పిడి జరిగిన ఉదంతాలు అన్నీ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, వికారాబాద్ జిల్లాల్లోనే అధికం. ప్రతి అధికారి గుండెల్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగం, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఫోరెన్సిక్ ఆడిటింగ్ రైళ్లు పరుగెత్తించనుంది. ఇప్పుడు ధరణి డేటా మొత్తం సజావుగా ఎన్ఐసీ చేతికి బదిలీ అయితేనే గత ప్రభుత్వంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు, కొందరు ఉన్నతాధికారుల అధికార దుర్వినియోగం, అక్రమాలు మొత్తం తప్పకుండా వెలుగు చూస్తుంది. రాష్ట్రంలో ఒక భూకంపం వచ్చినట్లేనని నిపుణులు అంటున్నారు. గండిపేట, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, గండి మైసమ్మ, మహేశ్వరం, బాలాపూర్, కందుకూరు, షాద్ నగర్, శంకర్ పల్లి, ఇబ్రహింపట్నం, మేడ్చల్, శామీర్ పేట, కుత్బుల్లాపూర్ తదితర మండలాల్లోనే కార్యాలయ సమయం తర్వాత కూడా ట్రాన్సక్షన్స్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివాదాస్పద భూములే టార్గెట్

తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అసలేం జరిగింది? ఇక్కడే దేశ, విదేశీ రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు ఎందుకు పెట్టాయి? అది కూడా వివాదాస్పద భూములనే కొనుగోలు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటి? ఆయా సంస్థల వెనుక తెలంగాణకు చెందిన ప్రముఖులెవరు ఉన్నారు? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోర్టు కేసుల్లో నలుగులుతున్న భూములనే కొనుగోలు చేస్తున్నారు. క్లియర్ టైటిల్ కలిగిన భూములకు బదులుగా కోర్టు కేసుల్లోని భూములను కొనుగోలు చేయడంలో ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రధానంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని భూములపైనే ఫోకస్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి, గండిపేట మండలం వట్టినాగులపల్లి, మంచిరేవుల రెవెన్యూ పరిధిలోని భూములనే అత్యధికం చేతులు మారుతున్నాయి. ఇందులో అత్యధికం జీవో 111 పరిధిలోనివి కావడం విశేషం. ఎలాగూ ఆ జీవో ఎత్తేసిన నేపధ్యంలో క్లియర్ టైటిల్ కంటే వివాదాస్పద భూములను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంస్థల వెనుక స్థానిక బడా కంపెనీల సపోర్టు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిషేదిత జాబితాల్లోని భూములను కొనుగోలు చేసిన సంస్థలపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తున్నది.

తెల్లారేసరికి మార్పు

ధరణి పోర్టల్, ఐజీఆర్ఎస్ వెబ్ సైట్లల్లో పలు సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో ఉంటాయి. సామాన్యులెవరికైనా ఆ భూములపై కేసులు ఉన్నాయని కనిపిస్తుంది. కానీ అసలు నిజాలు మాత్రం మాయం. సదరు భూములను ఎప్పుడెప్పుడు బ్లాక్ చేశారు? ఎప్పుడెప్పుడు అన్ లాక్ చేశారు? మరి అన్ లాక్ చేసినప్పుడు కొన్ని సర్వే నంబర్లు మాత్రమే ఎందుకు అన్ లాక్ అయ్యాయి.? మిగతా వారు అప్లికేషన్లు పెట్టుకున్నా నిషేదిత జాబితా నుంచి ఎందుకు తొలగించలేదు? కంపెనీలు కొనుగోలు చేసిన భూములకు సంబంధించినవే కొన్ని నిమిషాలు అన్ లాక్ కావడం వెనుక ఆంతర్యమేమిటో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు స్పష్టం చేయాలి. ధరణి పోర్టల్ ని పరిశీలిస్తే ఎప్పుడూ కోర్టు ఆర్డర్ ప్రకారం నిషేదితం అంటూ దర్శనమిస్తుంది. కానీ లావాదేవీలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. ఏ సమయంలో అన్ లాక్ అవుతాయో మాత్రం అంతుచిక్కడం లేదు. ఆ నిజం ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటికొస్తుంది. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఐపీతో చేశారు?

నిషేధిత జాబితాలో ఉన్నా ట్రాన్సక్షన్స్

గండిపేట, శేరిలింగంపల్లి, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, నిజాంపేట, గండి మైసమ్మ మండలాల్లో పీవోబీ జాబితాలో చేర్చిన ఆస్తుల క్రయవిక్రయాలు ఎలా సాగాయన్న అనుమానాలు ఉన్నాయి. వందలాది డాక్యుమెంట్లు అయ్యాయి. ఐతే సేల్ డీడ్స్ చేసినప్పటికీ ఆయా భూములన్నీ పీవోబీ జాబితాలో ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్, బ్లాక్ చేసిన తేదీ, అన్ లాక్ చేసిన తేదీ, మళ్లీ బ్లాక్ చేసిన తేదీ.. వీటిని గుర్తిస్తే అక్రమాల పర్వం వెలుగులోకి వస్తుంది. పలు బడా సంస్థలు కొనుగోలు చేసేటప్పుడే వాటిని అన్ లాక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ బ్లాక్ చేశారు. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి ఎవరి లాగిన్ ద్వారా ఈ దందా నడిచిందో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ కి ప్రభుత్వం ప్రకటించిన ఫోరెన్సిక్ ఆడిట్ కరెక్ట్ సమాధానం ఇస్తుంది. నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎలా అన్ లాక్ చేశారు? ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. క్రయ విక్రయాలు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ చేసిన తేదీలు, కోర్టు ఆర్డర్ అమలు చేసిన తేదీలు.. మధ్యలో సాగిన దందా అంశంపై దర్యాప్తు సాగిస్తే అసలైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ అధికారుల బండారం కూడా బయటపడుతుంది.

ఆ ఏరియాలోనే హైడ్

రైట్ టు ప్రైవసీ ఆప్షన్ ను రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్​, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లోనే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా శంషాబాద్, గండిపేట, కొత్తూరు, కేశంపేట, మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్, షాద్ నగర్ మండలాల్లో కొనుగోలు చేసిన వారే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుండడం గమనార్హం. పైగా ఆ లావాదేవీలన్నీ తాజాగా చేసినవే కావడం విశేషం. ఇటీవల గండిపేట మండలం వట్టినాగులపల్లిలో వివాదాస్పద భూములను కొనుగోలు చేసిన రాజకీయ అండదండలు పుష్కలంగా కలిగిన కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ ఆప్షన్ ద్వారా డేటాను దాచేశారు. ఆఖరికి కోర్టు డిక్రీ వచ్చి అమలుకు నోచుకోని భూములను కూడా పాత రైతుల నుంచి సేల్ డీడ్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ రిజిస్ట్రేషన్ ప్రకారమే రూ.వందల కోట్లుగా ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, పెద్ద మంగళారం, అజీజ్ నగర్, హిమాయత్​నగర్, కోకాపేట, వట్టినాగులపల్లి, పుప్పాలగూడ ప్రాంతాల్లో ట్రాన్సక్షన్ హిస్టరీని బయటపెడితే బినామీల దందా వెలుగులోకి వస్తుంది. ఈ రూ.వందల కోట్ల ల్యాండ్స్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా విచారిస్తే పెద్ద సంఖ్యలో ఆర్ధిక నేరగాళ్ల పేర్లు బయటికొచ్చే చాన్స్ ఉంది.

ఔటర్ పక్కనే భూములు

– ఔటర్ రింగ్ రోడ్డు దిగగానే చిలుకూరు కంటే ముందే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా చిలుకూరు భూముల మధ్యనే ఏర్పాటైంది. అక్కడి నుంచి చేవెళ్ల దాకా, ఇటు బుద్వేలుతో పాటు శంషాబాద్​మండలంలోని జీవో 111 పరిధిలోని గ్రామాల్లోనూ అనేక సర్కారీ భూములు ఉన్నాయి.

– మెయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో సర్వే 149లో 155.29 ఎకరాల గైరాన్ సర్కారీ, 202, 203లో 20 ఎకరాల భూదాన్, 218/1లో 173 ఎకరాల గైరాన్ సర్కార్.. ఇంకా సీలింగ్, అసైన్డ్ భూములు వందలాది ఎకరాలు ఉన్నది.

– శంకర్ పల్లిలో సర్వే నం.191లో 213 ఎకరాలు, కొండకల్ లో 219 ఎకరాలు, పొద్దుటూరులో 350 ఎకరాలు, ఫతేపూర్ లో పెద్ద ఎత్తున పొరంబోకు భూములు ఉన్నాయి.

– శంకర్ పల్లి మండలం శంకర్ పల్లి ఖల్సా, శంకర్ పల్లి పాయిగా, అంతప్పగూడ, పర్వేద చంచలంలో సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయి. టంగుటూరు, రావులపల్లి కలాన్, ఎర్వగూడ, మాసానిగూడల్లోనూ ప్రభుత్వ భూములు ఉన్నాయి.

– శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోనూ సర్కారీ భూములు కనిపిస్తున్నాయి. వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

సోషల్ ఆడిట్ పరిధిలోకి వచ్చే చట్టాలు

ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ పరిధిలోకి వచ్చే ప్రధాన చట్టాలు.

1. క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్, 1973

2. ఫైనాన్స్ యాక్ట్, 2018

3. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, 1977

4. ఇన్ కం ట్యాక్స్ యాక్ట్, 1961

5. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988

6. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్, 2002(పీఎంఎల్ఏ)

7. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్, 1988

Tags:    

Similar News