రెడీగా ఉండండి.. అన్ని రాష్ట్రాల పీసీసీలకు, సీఎంలకు ఏఐసీసీ ఆహ్వానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో స్టేట్ కొత్త పీసీసీ టీమ్‌పై చర్చించే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో స్టేట్ కొత్త పీసీసీ టీమ్‌పై చర్చించే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో కర్ణాటక బెలగావిలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఏఐసీసీ నుంచి ఆహ్వానం లభించింది. రాష్ట్ర పార్టీ పరిస్థితులను వివరించేందుకు రెడీగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. దీంతో స్టేట్ పార్టీ యాక్టివిటీస్, డెవలప్ మెంట్లు, భవిష్యత్ లో చేయబోయే కార్యక్రమాలు వంటి వాటిపై పీసీసీ ప్రెసిడెంట్ స్టడీ చేస్తున్నారు. ఏఐసీసీకి వివరించేందుకు తగిన స్థాయిలో మెటీరియల్ తయారు చేస్తున్నట్లు తెలిసింది.
సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీస్ మరింత స్పీడ్ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. కొత్త టీమ్ కోసం ఇప్పటికే ప్రాథమిక దశలో పేర్లను తయారు చేసిన పీసీసీ, త్వరలోనే మరి కొంత మందిని ఎంపిక చేయనున్నది. కమిటీ సెలెక్ట్ చేసిన పేర్లను ఏఐసీసీ పరిశీలించి అప్రూవల్ ఇవ్వనున్నది. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు తన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే తెలంగాణతోపాటు పెండింగ్ లో ఉన్న మరికొన్ని రాష్ట్రాల పీసీసీ కార్యవర్గాలపై కూడా సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించే అవకాశమున్నది. అంతేగాక దేశ, రాష్ట్ర పరిస్థితులను వేర్వేరుగా డిస్కషన్ చేసి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ సిద్ధం అవుతున్నది.
హాజరు కానున్న సీఎం, మంత్రులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన వేదికపై జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి హాజరుకానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు, సీడబ్ల్యూసీ మెంబర్లు, స్పెషల్ ఇన్వైటీస్ తప్పనిసరిగా అటెండ్ కావాలని ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు ఉన్నందున సీఎం కూడా బెంగళూరు షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ మీటింగ్ లో కేవలం పార్టీ అంశాలే డిస్కర్ చేస్తారని స్టేట్ కు చెందిన ఓ కీలక నేత తెలిపారు. కేబినెట్ విస్తరణ వంటి వాటికి పై చర్చ జరిగే చాన్స్ ఉండదని వివరించారు.
మినీ లేదా మీడియం కార్యవర్గం!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం జంబో సైజ్‌లో ఉన్నది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు కలిపి దాదాపు 30 మంది వరకు పనిచేస్తున్నారు. ఇక 56 మంది జనరల్ సెక్రెటరీలు, మరో 20 మంది వివిధ హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో టీపీసీసీ కమిటీ అవసరం లేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ పవర్ లో ఉన్నందున చిన్న కమిటీనే ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సీఎం, కేబినెట్ మంత్రుల అభిప్రాయాలను కూడా పీసీసీ చీఫ్ సేకరించారు. దీంతోపాటు పార్టీలోని ముఖ్య నేతల ఒపీనియన్లను కూడా సేకరించనున్నారు. మినీ లేదా మీడియం సైజులో కమిటీని ఫిక్స్ చేయాలని పీసీసీ చీఫ్భావిస్తున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఏఐసీసీ అప్రూవల్ తర్వాత కమిటీ ప్రకటన ఉండనున్నది. కొత్త ఏడాదిలోనే కొత్త కమిటీ ప్రకటించే అవకాశమున్నది.