Kishan Reddy: ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని తెలియజేయాలి.. కిషన్ రెడ్డి పిలుపు
ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని, అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని అన్నారు. మోడీ సర్కార్ వాజ్‌పేయీ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని వెల్లడించారు.
అంబేడ్కర్ బతికి ఉన్నప్పుడు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందని, మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌తో నెహ్రూ రాజీనామా చేయించారని గుర్తుకుచేశారు. 1954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మందికి కాంగ్రెస్ భారతరత్న ఇచ్చిందన్నారు. కానీ అంబేడ్కర్‌ను ఎందుకు విసర్మించిందో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో అంబేడ్కర్ ఫొటో కూడా ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.