Madugulapalli: అడ్డూ అదుపేదీ..? మండలంలో జోరుగా ఎర్రమట్టి దందా
మాడుగులపల్లి మండలంలో ఎర్రమట్టి దందా జోరుగా సాగుతోంది.
దిశ, మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలో ఎర్రమట్టి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలలో మట్టిని తరలించాంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. కానీ మండలంలో మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దళారులు మట్టిని కొల్లగొడుతున్నారు. మండలంలోని కుక్కడం గ్రామంలో గత రెండు రోజులుగా ఎర్రమట్టి అక్రమ రవాణా కొనసాగుతుంది. "తవ్వుకున్నోళ్లకు... తవ్వుకున్నంత" అన్నట్లుగా ఈ దందా సాగుతోంది. ఒక జేసీబీ, 5 టిప్పర్లు సహాయంతో ఎర్రమట్టిని రాత్రి, పగలు తేడా లేకుండా మాఫియా తరలిస్తూ సొమ్ము చేసుకుంటుంది. తవ్వకాలకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఒక్కొక్క టిప్పర్ కు రూ.3000 నుంచి రూ.5000 వరకు తీసుకొని దళారులు లక్షలు సంపాదిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలు..
మట్టి తవ్వకాలు జరపాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టిని తరలించాలంటే ప్రభుత్వానికి సీనేజ్ కట్టి మట్టి తవ్వకాలు జరిపితే ఒక క్రమ పద్ధతిలో జరపాలి. కానీ మండలంలో మట్టి దళారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయనీ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ మట్టి రవాణాని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.