Armur: వేడుకలలో పెరుగుతున్న కత్తుల కల్చర్

ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకూ కత్తుల కల్చర్ పెరిగిపోతోంది.

Update: 2024-12-25 02:21 GMT

దిశ, ఆర్మూర్ : ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకూ కత్తుల కల్చర్ పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు కత్తులు, కటార్లతో యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి కొందరు తాము అడిగింది ఇవ్వకుంటే చంపుతామంటూ వ్యాపారులను బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు బహిరంగంగానే జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తుల కల్చర్ పెరగడానికి సెలబ్రిటీలు, లీడర్లే కారమన్న ఆరోపణలు ఉన్నాయి. మీటింగ్ లకు, బర్త్ డే ఫంక్షన్లలో లీడర్లు కత్తులు పట్టుకొని ఫోజులు ఇస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని బర్త్ డే కార్యక్రమాల్లో కేక్ కట్టు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈ తతంగారంరి మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. నగరంలో రోజురోజుకు కత్తుల కల్చర్ పెరిగి పోతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్ ల ఆదారంగా కొందిరిపై కేసులు పెట్టినప్పటికీ ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల ఘటనకు ఆలవాలమై తరచూ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రానికి పాకింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో పెర్కిట్ కు చెందిన ఓ మైనార్టీ యువకుడిపై జిరాయత్ నగర్ కు చెందిన మైనార్టీ యువకులు కలిసి కత్తులతో దాడి చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి సమయాల్లో యువకులు నానా హంగామా సృష్టిస్తూ గొడవలకు దిగుతూ తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఇంత తంతు జరుగుతున్న ఆర్మూర్ లోని పోలీసు అధికారిక గణం తమకేం పట్టనట్లు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆర్మూర్ ప్రాంతంలోని జనం కోడై కూస్తుంది. గతంలో అంకాపూర్ లోని పండరీపూర్ చాయ్ హోటల్లో ఓ మైనారిటీ యువకుడు అతడి పుట్టిన రోజు వేడుకలను తల్వార్తో కట్ చేసి భారీ సంఖ్యలో యువకులతో కలిసి హంగామా సృష్టించగా.. ఆ విషయంపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ యువకులతో మాట్లాడి మరొక్కసారి అలాంటి చర్యలు ఆర్మూర్ లో పునరావృతం కావద్దని గతంలో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ను గట్టిగా మందలించినట్లు తెలిసింది. ఇటీవల పెర్కిట్ కు చెందిన ఓ మైనార్టీ యువకుడుపై జిరాయత్ నగర్ కు చెందిన యువకులు కలిసి కత్తులతో అర్థరాత్రి దాడి చేసి కలకలం సృష్టించారు. ఇంత జరుగుతున్న పోలీసుల్లో మార్పు రావడంలేదని ఇలాంటి సంఘవిద్రోహక చర్యలకు పాల్పడే యువకులను కట్టడి చేయాల్సిన పోలీస్ దళం నిమ్మకు నీరెత్తినట్లుగా పట్టించుకోవడంలేదని ఆర్మూర్ జనం విమర్శిస్తున్నారు.

కొరవడిన పోలీసుల నిఘా.. పెట్రోలింగ్..

ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 10దాటిన తర్వాత వ్యాపార సముదాయాల దుకాణాలు బందు చేయాలని కఠినమైన నిబంధన ఉన్న ఆర్మూర్ ప్రాంతానికి మాత్రం ఆ నిబంధన ఏమున్నట్టు కనిపించడం లేదని ప్రజలు చర్చించు కుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రధానంగా అర్ధరాత్రిలో దర్జాగా వ్యాపారాలు జరుగుతున్న అటువైపు పోలీస్ యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదని తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అర్ధరాత్రిలో వ్యాపారులు నిర్వహించే పాన్ షాపులు, హోటళ్ల దుకాణాల నిర్వాహకుల నుంచి పోలీసు బాసులు వేల రూపాయల్లో మామూళ్లను దండు కుంటున్నారని విశ్వసనీయ సమాచారం. మామూళ్ల మత్తులో జోగుతూనే పోలీసు అధికారులు అర్ధరాత్రి సమయాల్లో దర్జాగా నడుస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆర్మూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆర్మూర్ యువత అర్ధరాత్రి రోడ్లపై బైక్ రేసింగ్, విచ్చలవిడిగా మద్యం సేవించడం, ధూమపానం తాగుతూ కత్తులతో స్వైర విహారం చేస్తూ ఆర్మూర్ ప్రాంతంలోని రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుందని, అర్ధరాత్రుల్లో పోలీసుల పెట్రోలింగ్ సరియైన విధంగా చేయడం లేదని ఆరోపణలు ఆర్మూర్ ప్రాంతంలో గుప్పుమంటున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి దాటి తెల్లారు జాము వరకు ప్రధాన కూడళ్లలోని పాన్ షాపులు హోటల్లు దర్జాగా సదరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవడంపై పోలీసుల నిఘా కొరవడిందని, జరుగుతున్న కత్తిపోట్ల వివాదాలకు గొడవలకు కారణమని ఆర్మూర్ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. యువకుల అల్లరులతోపాటు ఆర్మూర్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయాల్లో దొంగతనాల అలజడి తరచూ జరుగుతుండడంతో ఆర్మూర్ ప్రాంత ప్రజలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

Tags:    

Similar News