యాసంగి పంటల సాగు కోసం అందుబాటులో ఎస్సారెస్పీ జలాలు
యాసంగి పంటల సాగు కోసం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటిని అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 25: యాసంగి పంటల సాగు కోసం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటిని అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిని సరస్వతీ కెనాల్, కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్ ల ద్వారా ఉదయం దిగువకు విడుదల చేశారు. ఎస్ఆర్ఎస్సీ పర్యవేక్షక శ్రీనివాసరావు గుప్త, కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి, డీఈలు రఘుపతి, గణేశ్, గంగా భూషణ్ లు ఏఈలు ముందుగా కాకతీయ కాలువకు పూల సమర్పణ చేశారు. అనంతరం కాకతీయ కాలువకు నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆయకట్టు రైతులతో కలిసి లక్ష్మీ కెనాల్ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దిగువకు విడుదల చేశారు. లక్ష్మీ కెనాల్ ద్వారా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఆయకట్టు రైతులతో కలిసి సరస్వతీ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, సాయంత్రం వరకు 5500 క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.