వారి సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సహకారంతో కొత్త మండలాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు
దిశ, భిక్కనూరు : సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సహకారంతో కొత్త మండలాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలోని ఆయన నివాసంలో పాల్వంచ మండలానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన తమ మండలంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన కొత్త మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సహకారంతో, సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి గ్రంథాలయాల ఏర్పాటుకు, నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థిని ,విద్యార్థులకు ప్రిపేర్ అయ్యేవారికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.