Suryapeta: మైక్రో పడగ..! పల్లెల్లో పుంజుకుంటున్న మైక్రోఫైనాన్స్ దందా

జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తిలతో పాటు పలు మండలాల్లో, గ్రామాలలో పేదలను టార్గెట్ చేస్తూ వడ్డీ వ్యాపారం దందా కొనసాగుతుంది.

Update: 2024-12-25 02:29 GMT

దిశ, సూర్యాపేట టౌన్: జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తిలతో పాటు పలు మండలాల్లో, గ్రామాలలో పేదలను టార్గెట్ చేస్తూ వడ్డీ వ్యాపారం దందా కొనసాగుతుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న మైక్రో ఫైనాన్స్ దందాకు అడ్డుకట్ట వేయకుండా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకొని ఎన్నో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాయిదాలు చెల్లించలేని వారిపై దాడులకు సైతం వెనకాడడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండానే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాలలో చిన్న రూము లను అద్దెకు తీసుకొని జిల్లా వ్యాప్తంగా తమ దందాను విస్తరింప చేసుకుంటున్నారు.

అడ్డగోలుగా దోపిడీ..

అమాయక నిరుపేదల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న ఫైనాన్స్ సిబ్బంది వాయిదాల పద్ధతిలో అప్పులు చెల్లించలంటూ అధిక వడ్డీలను వసూలు చేస్తున్నారు. ఎక్కువగా దినసరి కూలీలు, నిరక్షరాస్యులే కావడంతో సిబ్బంది చెప్పిందే లెక్కగా మారుతుంది. రుణాలు ఇచ్చే సమయంలో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్, చార్జీల పేరిట అదనపు వస్తువులకు ఎగబడుతున్నారు. పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. నూటికి రూ.ఐదు నుంచి రూ.10 శాతం వరకు వడ్డీతో అప్పులు ఇస్తూ బలవంతపు వసూళ్లకు ఎగబడుతున్నారు. అత్యవసర సమయంలో నైతే 20శాతం వరకు వడ్డీలు ఇస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి రుణాలను మంజూరు చేస్తున్నారు. ఒక్కో గ్రూపుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు అదనంగా దండుకుంటున్నారు. ఏజెంట్లు చెప్పే మాయ మాటలకు అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదైనా ఒక నెల వాయిదా చెల్లించకపోతే వడ్డీల మీద వడ్డీలు వేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్య బారిన పడి చనిపోయిన ఇంటి ముందు శవం ఉన్న వడ్డీ మాత్రం చెల్లించలేదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో వత్తిల్లు పెరిగిపోతున్నాయి. అసలే గ్రామాల్లో నీతి నిజాయితీ పరువు ప్రతిష్ఠలకు పోతున్న అమాయక ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కట్టడి చర్యలు కరువు..

మారుమూల గ్రామాల్లో విచ్చలవిడిగా సాగుతున్న మైక్రో ఫైనాన్స్ లపై నిఘా కరువు అవుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో తరచుగా ఫైనాన్స్ సిబ్బందికి అమాయక ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతున్నా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న అప్పు తీర్చాలంటూ ఉచిత సలహాలను ఇస్తున్నట్లు సమాచారం. ఎలాంటి పెట్టుబడి ఖర్చు లేకుండా తేలికగానే వస్తున్న అప్పులకు అలవాటు పడిన కొందరు మైక్రో ఫైనాన్స్ మాఫియా మాయలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ పేరిట అప్పులు ఇస్తూ వాయిదాలు పద్ధతిలో వసూలు చేస్తున్నారు. తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో ఇంటికి వచ్చి వడ్డీ అసలుతో సహా వాయిదాలను చెల్లించాలని ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ వ్యాపారుల ఆగడాలను తట్టుకోలేక చిరు వ్యాపారాలు అమాయక కూలీలు, గిరిజనలు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి చోరబడి వాయిదాలు చెల్లించాలంటూ బల వంతానికి దిగుతున్న అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ రుణాలపై ఏమాత్రం అవగాహన లేని అమాయక నిరుపేదలు అప్పు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేసిన కష్టమంతా ఫైనాన్స్, వాయిదాలు వడ్డీలకే సరిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ మైక్రో ఫైనాన్స్ పై దృష్టి సారించి మైక్రో ఫైనాన్స్ బారిన పడిన ప్రజలకు భరోసా ఇచ్చి న్యాయం చేయాలని, మైక్రో ఫైనాన్స్ ని కట్టడి చేయాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటుంది.

వారం వారం కడుతున్నాం.. సతీష్, దురాజ్ పల్లి

కొద్దిరోజుల క్రితం ఫైనాన్స్ వారు మా ఊరికి వచ్చారు. అతి తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నామని చెప్పారు. మా కాలనీ వాళ్లం ఐదుగురు గ్రూపుగా చేరి డబ్బులు తీసుకున్నాం. వారం వారం తిరిగి డబ్బులు కడుతున్నాం. ఒక్కరోజు ఆలస్యమైతే కట్టేదాకా ఊరుకోరు. తీసుకున్న డబ్బులు ఏమో కానీ వారం వారం కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. సంపాదించిన డబ్బులు మొత్తం లోన్ కట్టడానికి అయిపోతున్నాయి. ఈ ఫైనాన్స్ వల్ల ఇల్లు కూడా గడవడం లేదు.

ప్రజలను మోసం చేస్తే చర్యలు తప్పవు.. జి. రవి, డీఎస్పీ

సూర్యాపేటలో మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు మైక్రో ఫైనాన్స్ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రజలను రుణాల పేరుతో అధిక వడ్డీలు కట్టాలని వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రుణాల పేరుతో ఎవరినైనా ఇబ్బంది పెడితే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుంది.

Tags:    

Similar News