రాజకీయాల్లో ఫైర్ తగ్గించిన ‘రాములమ్మ’.. ఎందుకు సైలెంట్ అయ్యిందో తెలుసా?
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రాములమ్మ గత కొంతకాలంగా తన ఫైర్‌ను తగ్గించినట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రాములమ్మ గత కొంతకాలంగా తన ఫైర్‌ను తగ్గించినట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్. సినీనటి, రాజకీయ నాయకురాలైన విజయశాంతి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత చురుగ్గా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాకు మాత్రమే ఆమె పరిమితమైనట్టు కనిపిస్తోంది. గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం తగ్గించారు.
క్రియాశీలక రాజకీయాలకు దూరం!
చిత్రసీమలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి.. తెలుగునాట అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. సొంతంగా పార్టీ పెట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనంతరకాలంలో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత బీజేపీలో జాయిన్ అయి.. చివరకు సొంతగూటికి(కాంగ్రెస్) చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను చేసిన పోరాటం గురించి రాములమ్మ సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు చెప్పారు. గత కొన్నేండ్లుగా తనకు సరైన గుర్తింపు, అవకాశాలు ఇవ్వడం లేదనే ఆవేదనలో ఆమె ఉన్నట్టుగా అభిమానులు చెప్తున్నారు. ఏడాదికాలంగా ఆమె ఇంటి నుంచే రాజకీయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతున్నారు.
ఈ నెలలో చూస్తే.. తెలంగాణ తల్లి విగ్రహం, అల్లు అర్జున్ సంధ్య థియేటర్ అంశం, సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వంటి వాటిపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి.. కొన్ని చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కానీ, ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె వాటికే సమయం కేటాయిస్తూ.. పాలిటిక్స్‌కు కొంత దూరం అయినట్టు అభిమానులు పేర్కొంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తనకు మంచి అవకాశాలు వస్తాయని రాములమ్మ ఎదురుచూస్తున్నట్టుగా తెలిసింది.