Nirmal: అయ్యప్ప కటాక్షం కోసం మహా పాదయాత్ర

మహాశివుడు, విశ్వామిత్రుల కఠోర దీక్షల గురించి విన్నాం.

Update: 2024-12-25 02:14 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : మహాశివుడు, విశ్వామిత్రుల కఠోర దీక్షల గురించి విన్నాం. అదే కోవలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అయ్యప్ప స్వామి భక్తుడు... తాను ప్రీతిపాత్రంగా విశ్వసించే శబరిమల అయ్యప్ప కటాక్షం కోసం మొదలుపెట్టిన పాదయాత్ర ఈ ఏడాదికి 14 సంవత్సరాలు పూర్తయింది. తీవ్రమైన చలి, మంచు కురిసే కాలంలో... ప్రతి ఏటా నిర్మల్ నుంచి శబరిమల దాకా ఆ భక్తుడు తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగానే...నవంబర్ 11 న నిర్మల్ పట్టణంలోని నగరేశ్వర వాడ నుండి ప్రారంభమైన ఆ భక్తుడి పాదయాత్ర డిసెంబర్ 21 న శబరిమల చేరింది. నిర్మల్ కు చెందిన గంగోని శ్రీనివాస్ అనే అయ్యప్ప స్వామి భక్తుడు ప్రతి ఏటా చేస్తున్న నిర్మల్ టు శబరిమల మహా పాదయాత్ర కు ఏటేటా స్పందన పెరుగుతున్నది.

ప్రతి ఏటా పెరుగుతున్న భక్తులు..

సరిగ్గా 14 సంవత్సరాల క్రితం నవ యువకుడిగా ఉన్న శ్రీనివాస్ అయ్యప్ప స్వామి భక్తుడిగా తన పాదయాత్రను ప్రారంభించారు. తొలి సంవత్సరం పదిమంది భక్తులతో కలిసి ఆయన శబరిమల పాదయాత్ర మొదలుపెట్టారు. అలా ప్రతి ఏటా తన వెంట నడిచే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆయన చెప్పారు. అయితే అందరూ ప్రతిసారి పాదయాత్రలో పాల్గొనక పోయినప్పటికీ... తాను మాత్రం తన మహా పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం 46 మంది స్వాములతో పాదయాత్ర కొనసాగింది. నాలుగు రాష్ట్రాల మీదుగా పాదయాత్ర సాగిందని చెప్పారు. 42 రోజులు అంటే ఓ మండల కాలం మాయాత్రాన్ని పూర్తి చేసుకుంటామని, 42 రోజులు 42 ఊళ్ళలో రాత్రి పడుకొని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మా పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం 6.50 నిమిషాలకు పాదయాత్ర ముగిసేలా ప్రణాళిక రచించుకున్నారు. పాదయాత్ర 41 రోజుల తర్వాత ఎరిమేలిలో వేటతులాడి అక్కడ ఉండే దేవాలయంలో ఇరుముడి కట్టుకొని పెద్ద పాదం లేదా చిన్న పాదంతో మా యాత్రని కొనసాగిస్తామన్నారు. 42 వ రోజున పంబ నదిలో స్నానమాచరించి, అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తామన్నారు. ఈ ప్రయాణంలో ఒక వంట మాస్టారు, ఒక చిన్న డిసిఎంలో వంట సామాగ్రి తీసుకువెళ్తామన్నారు. ఇలా ప్రతి ఏటా సుమారు 1600 కిలోమీటర్ల మేర తాము పాదయాత్రగా వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి గొప్ప వరంగా భావిస్తున్నామని... అయ్యప్ప స్వామి కటాక్షం కోసం ఈ జీవితకాలమంతా ప్రతి ఏటా తన పాదయాత్ర కొనసాగిస్తానని గంగోని శ్రీనివాస్ వెల్లడించారు. కాగా శ్రీనివాస్ తన సహచర భక్తజన మిత్రమండలితో ప్రతి ఏటా చేపడుతున్న మహాపాదయాత్ర అభినందనీయమే.

Tags:    

Similar News