సోనియా హాజరుపై కొనసాగుతున్న సస్పెన్స్.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఏఐసీసీ నుంచి సోనియాగాంధీ హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియాగాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ప్రోగ్రామ్‌కు హాజరయ్యే అవకాశమున్నది. రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లవచ్చని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
రాహుల్, ప్రియాంకలను సైతం..
సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీని సైతం పీసీసీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీని ఈ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించడంతో ప్రజలకు స్పష్టమైన మెసేజ్ వెళ్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారుతుందన్నది కాంగ్రెస్ భావన. సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడం పీసీసీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అనారోగ్య కారణాలు, జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కిపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంటారా? లేక ఆమె రాకుండా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను మాత్రమే పంపుతారా అనే ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
రాయదుర్గం స్టూడియోకు సీఎం
రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ రావడంతో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ వేదికగా రాష్ట్ర గీతాన్ని లాంఛనంగా రిలీజ్ చేయాలనుకుంటున్నది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతం కంపోజింగ్‌ను నాలుగు రోజుల క్రితమే పరిశీలించిన సీఎం రేవంత్... కొన్ని సవరణలు సూచించారు. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్‌తో వస్తున్న ఈ గీతానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్ ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని స్టుడియోకు వెళ్లారు.. రాష్ట్ర చారిత్రక ప్రాధాన్యత, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలు తదితరాలన్నింటి మేళవింపుతో రాష్ట్ర గేయం నిడివి దాదాపు 90 సెకన్లకు పైగానే ఉంటున్నట్లు తెలిసింది.