Warangal: ఓరుగల్లులో రియల్ భూం..! నిధుల వరదతో సీన్ చేంజ్
ఈనెల మధ్యస్తం నుంచి వరంగల్ పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రియల్ వ్యాపారం పుంజుకుంటోంది.
ఓరుగల్లు రియల్‌ఎస్టేట్‌వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. హైదరాబాద్తర్వాత రాష్ట్రానికి రెండవ రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం, త్రినగరి అభివృద్ధికి వేల కోట్ల నిధులు మంజూరు చేయడంతో అందరి చూపు ఇప్పుడు ఓరుగల్లుపై పడింది. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న రియల్‌వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. మామునూరు ఎయిర్ పోర్ట్ , ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడం, గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణం శరవేగంగా జరుగుతుండడంతో రియల్ వ్యాపారులకు కలిసివచ్చే అంశాలు. దీంతో రాష్ట్ర నలుమూలలనుంచి వరంగల్‌లో రియల్‌వ్యాపారం చేసేందుకు ప్రముఖ కంపెనీలు సైతం పోటీపడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న వెంచర్లలో గజానికి రూ.5వేల వరకు ధర పెంచేయడం గమనార్హం. కాజీపేట, వరంగల్, హన్మకొండ పట్టణాల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో రియల్‌భూం కొనసాగుతోంది. భూముల ధరలకు భవిష్యత్‌లో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉండడంతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో : ఈనెల మధ్యస్తం నుంచి వరంగల్ పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రియల్ వ్యాపారం పుంజుకుంటోంది. సరిగ్గా నెలక్రితం వరకు కూడా స్థిరాస్తి వ్యాపారం తీరుపై వ్యాపారులు పెదవి విరిచారు. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, దీంతో వ్యాపారం సాగడం లేదన్న అభిప్రాయం రియల్ వర్గాల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఎందుకనో గతేడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య.. ఆదాయంతో ఈ సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లు, ఆదాయంతో పోల్చినప్పుడు దాదాపు 15శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించడం ఆ తర్వాత.. రైల్వే డివిజన్ కేంద్రంగా అనౌన్స్ చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్ట్ పునః ప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్డు భూ సేకరణకు నిధుల కేటాయింపు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి, అండర్ డ్రైనేజీ వ్యవస్థకు నిధుల మంజూరు, మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడం, గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం, పలు రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరీలు ఇవ్వడం వంటి పరిణామాలు రియల్ వ్యాపారానికి దోహదం చేస్తాయన్న అభిప్రాయం రియల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రియల్ సీన్ చేంజ్...!
ప్రభుత్వ అభివృద్ధి చర్యలతో రియల్ వ్యాపారానికి సానుకూలత ఏర్పడింది. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై మాత్రమే ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న రియల్ వ్యాపారం.. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూం పెరగడం గమనార్హం. కాజీపేట, వరంగల్, హన్మకొండ పట్టణాల నుంచి 20కిలోమీటర్ల వరకు రియల్ భూం కొనసాగుతుండటం విశేషం. ఇక ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పరిధిలో వెలిసిన వెంచర్లలో, కుడా వెంచర్లలో గజం మీద ఏకంగా రూ.2 నుంచి 5వేల వరకు ధరలు పెంచేయడం గమనార్హం. సిటీకి దగ్గరలోని భూములకు సమీప భవిష్యత్‌లోనే బాగా డిమాండ్ ఉంటుందని భావిస్తున్న కొనుగోలు దారులు సైతం ఆసక్తి చూపుతున్నారంటూ రియల్ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.
వరంగల్‌పై రియల్టర్ల చూపు..!
రాష్ట్ర రెండో రాజధాని స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పాటు తదనుగుణంగా చర్యలు తీసుకుంటుండటంతో ఆంధ్రప్రదేశ్ రియల్టర్లు, హైదరాబాద్‌లోని దిగ్గజ రియల్ వ్యాపార సంస్థలు కూడా వరంగల్‌లో వెంచర్లను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్‌మెంట్‌కు స్కోప్ ఉన్న ప్రాంతాలపై ఆరా తీస్తూ బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా వ్యాపార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇన్నాళ్లు వేరు.. ఇక వేరు..
వరంగల్‌లో రియల్ వ్యాపారం అనేది ఇన్నాళ్లు వేరు.. ఇప్పుడు వేరనే చెప్పాలి. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రభుత్వం చెప్పడంతో పాటు నిధులు కూడా మంజూరు చేసింది. వరంగల్ చుట్టూ డెవలప్‌మెంట్ ఎవల్యూషన్ జరగడానికి ఇది దోహదం చేయనుంది. వరంగల్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, కాజీపేట జంక్షనకు రైల్వే డివిజన్ హోదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, నగరానికి అవతల గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణం జరుగుతుండటం, ట్రైసిటీస్‌ను కలుపుతూ కొన్ని ప్రధాన రహదారులు కూడా వస్తుండటం వంటివి శుభ పరిణామం. వరంగల్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీగా చెప్పవచ్చు. ఓ స్థాయి వరకే ప్రభుత్వాల ప్రోత్సాహం నగరాలకు అవసరం అవుతుంది.. ఆ తర్వాత డెవలప్‌మెంట్ అనేది నగరాలు సంపాదించుకుంటాయి. ఆ కోవలో వరంగల్‌కు బాటలు పడుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారి తాళ్లపల్లి సురేష్ అంటున్నారు.