Asifabad: దర్జాగా అక్రమ నిర్మాణాలు.. నోటీసులు ఇచ్చిన మారని తీరు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలుదర్జాగా కొనసాగుతున్నాయి.

Update: 2024-11-25 02:22 GMT

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలుదర్జాగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత అండదండలతో ఈ ఇండ్ల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో కబ్జాకు గురైన నాలా ఆక్రమణను ఆర్డీవో లోకేశ్వర్ రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు తొలగించారు. అదే సమయంలో బీడీపీపీ ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వంగాల శశి, సరోజన, వడ్డేపల్లి హరీష్ లకు 15 రోజులోపు నిర్మించిన అక్రమ ఇళ్లను తొలగించాలని.. లేని పక్షంలో తామే జేసీబీలతో కూల్చేస్తామని హెచ్చరిస్తూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 రోజులు కావస్తున్నా నేటీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు నోటిసులు అందుకున్న సదరు వ్యక్తులు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులు.. హెచ్చరికను పట్టించుకోకుండా యథేచ్ఛగా ఇండ్ల నిర్మాణ పనులను శరవేగవంతంగా నిర్వహిస్తున్నారు. నోటిసులు ఇచ్చిన పనులు కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు పనితీరు పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత అనుచరుడి అక్రమ భావన నిర్మాణం ఉండటంతో కూల్చి వేయకుండా రెవెన్యూ అధికారుల పై ఒత్తిడి చేస్తున్నారనే బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

అక్రమ కట్టడాలను ప్రోత్సహించం.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్

ప్రభుత్వ అసైండ్ భూముల్లో ఆక్రమణ, అక్రమ కట్టడాలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. అలాంటి వారిని తమ పార్టీ ప్రోత్సాహించదు. అక్రమంగా నిర్మాణం చేపడుతున్న వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు.. తప్పకుండా వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న. అక్రమ కట్టడాల్లో ఏ నాయకుడైనా ఉంటే, లేక నా బంధువులు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడి.. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడ్ని అని పేర్లు చెప్పి ఉంటే మేము ఊరుకునేది లేదు. కొందరు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.

Tags:    

Similar News