సీఎంఆర్ గోల్ మాల్.. రైస్ మిల్లర్ల మాయాజాలం..
కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రూ.133 కోట్ల బియ్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, మంచిర్యాల : కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రూ.133 కోట్ల బియ్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్సీఐకి సకాలంలో బియ్యం అందించక అక్రమాలకు పాల్పడుతున్నారు. కోర్టు గడప ఎక్కి కోట్ల రూపాయల ఎగ్గొట్టేందుకు మిల్లు యజమానుల ఎత్తుగడలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ లోపమో.. అధికారుల అండదండలో ఏమోగానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు సిద్ధపడ్డారు. జిల్లాలో 20 రైస్ మిల్లులు, అగ్రో ఇండస్ట్రీస్ పై కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేసి వాటిని నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత మిల్లర్లది.. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సీఎంఆర్ ప్యాడి స్కాం రైతుల కంటే మిల్లర్లకు, వారికి సహకరించిన అధికారులకే మేలు జరిగిందని తెలుస్తోంది. నష్టం వాటిల్లిందనే సాకులు చూపి పందికొక్కుల్లా బియ్యాన్ని బొక్కేశారు. ఇష్టారాజ్యంగా ధాన్యాన్ని మిల్లులకు తరలించి బియ్యాన్ని సొమ్ము చేసుకున్నారు. పైగా కోర్టు గడప ఎక్కికోట్ల రూపాయలు ఎగ్గొట్టేందుకు ప్లాన్ కూడా వేశారు. పర్యవేక్షణ లోపమో.. అధికారుల అండదండలో ఏమోగానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు సిద్ధపడ్డారు. ఆలస్యంగానైనా తేరుకున్న జిల్లా వ్యాప్తంగా 20 రైస్ మిల్లులు, ఆగ్రో ఇండస్ట్రీస్ లపై అధికారికంగా కేసులు నమోదయ్యాయి.
రైస్ మిల్లులు, ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్వాహకులు రైతుల నుంచి వరి ధాన్యం ప్రతి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తారు. సదరు ధాన్యం నుంచి వచ్చే బియ్యాన్ని మిల్లుల యజమానులు ప్రభుత్వానికి అప్పగించాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చినందుకు ప్రభుత్వం మిల్లుల యజమానులకు కమిషన్ చెల్లిస్తుంది. జిల్లాలో మొత్తం 55 రైస్ మిల్లులు ఈ ప్రక్రియ చేపడుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం నుండి మిల్లుల యజమానులు లక్ష్యాలకు అనుగుణంగా బియ్యం సరఫరా చేయడం లేదు. ఎందుకని అడిగితే నష్టం వాటిల్లిందని అధికారులకు కుంటి సాకులు చెబుతూ వచ్చారు. ధాన్యం తడిసిపోయిందని, ధాన్యపు గన్నీ సంచులు చిరిగి పోయాయని ఒక్కో కారణం చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఆ శాఖకు తలకు మించిన భారం అయిపోయింది. ఇలా రెండు సంవత్సరాల నుంచి లెక్కిస్తే మొత్తంగా 133 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు జిల్లా స్థాయిలో అధికారులు గుర్తించారు. బియ్యం బకాయి పడ్డ రైస్ మిల్లుల పై కొరడా ఝుళిపించారు. మొత్తం 20 రైస్ మిల్లుల పై కేసులు నమోదు చేశారు.
కేసులు నమోదైన ఆ 20 మిల్లులు ఇవే..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 రైస్ మిల్లుల పై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేశారు. 20 మిల్లుల నుండి 133 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని గుర్తించారు. వాటిని రాబట్టే చర్యల్లో భాగంగా నోటీసులు సైతం జారీ చేశారు. బకాయిలు చెల్లించేంత వరకు కొత్తగా వరి ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. కేసులు నమోదైన మిల్లుల వివరాలను పరిశీలిస్తే.. జిల్లాలోని జైపూర్ మండలంలోని బీఎస్ వైరా రైస్ మిల్లు అత్యధికంగా 19 కోట్ల 7 లక్షలు బకాయి ఉంది. అదేవిధంగా ఇదే మండలంలోని అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్ రైస్ మిల్లు(కుందారం) 3 కోట్ల 17 లక్షలు, బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్(టేకుమట్ల) 8 కోట్ల 32 లక్షలు, సత్యశివ ఆగ్రో ఇండస్ట్రీస్(నర్సింగపూర్) 5 కోట్ల 22 లక్షలు, ఈశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్(ఇందారం) 2 కోట్ల 56 లక్షలు, శివ సాయి మల్లిఖార్జున ట్రేడర్స్(ఇందారం) నుండి బకాయిలు రావాల్సి ఉంది. వీటితో పాటు బెల్లంపల్లి మండలంలోని మాతేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్(లక్ష్మిపూర్) నుండి 6 కోట్ల 53 లక్షలు, దండెపల్లి మండలంలోని వెంకటరమణ రైస్ మిల్లు(పెద్దపేట) 6 కోట్లు, హాజీపూర్ మండలం నర్సింగపూర్ దుర్గ ఇండస్ట్రీస్ నుండి కోటీ ఎనిమిది లక్షల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది.
రూ. 133 కోట్ల బకాయి..
చెన్నూర్ మండలంలోని సోమేశ్వర రైస్ మిల్లు(ఆస్నాద్) 5 కోట్ల 2 లక్షలు, శ్రీ రాజ రాజేశ్వర మోడ్రన్ రైస్ మిల్లు(కత్తెరశాల) 3 కోట్ల 45 లక్షలు, శివమణి రైస్ మిల్లు(చెన్నూర్), జన్నారం మండలంలోని మణికంఠ రైస్ మిల్లు(సింగరాయిపేట) నుండి 3 కోట్ల 16 లక్షలు, శ్రీ లక్ష్మీ నరసింహ మోడ్రన్ రైస్ మిల్లు(కలమడుగు) నుండి మరో 3 8 లక్షలు రావాల్సి ఉండగా.. కోటిపల్లి మండలంలోని శ్రీ వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్ 8 కోట్ల 33 లక్షలు, లక్షెట్టిపేట మండలంలోని జై యోగేశ్వర ఇండస్ట్రీస్ (కొత్తూర్) 9 కోట్ల 6 లక్షలు, మందమర్రి మండలం పొన్నారం గ్రామంలోని నీలం బ్రదర్స్ మోడరన్ రైస్ మిల్లు 2 కోట్ల 4 లక్షలు బకాయి పడ్డాయి. ఇవే కాకుండా నెన్నెల మండలంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లు(నందులపల్లి) 4 కోట్ల 34 లక్షలు, తాండూర్ మండలంలోని వాసవి మాతా ఆగ్రో ఇండస్ట్రీస్(రేచిని) 15 కోట్ల 74 లక్షలు బకాయిల పడగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసీసీలో గల హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అత్యధికంగా 17 కోట్ల 77 లక్షల బకాయిలు పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో కేసు నడుస్తున్న దరిమిలా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బొక్కేసిన రైస్ మిల్లు యజమానుల నుంచి ఈ సొమ్ము వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.