పింఛను సొమ్ము స్వాహా..
మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో పింఛను చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో పింఛను చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు పంచాయతీ కార్యదర్శులు పింఛను చెల్లింపు సందర్భంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి లబ్ధిదారుడి నుంచి 10 నుంచి 16 రూపాయల చొప్పున దర్జాగా వసూలు చేయడమే కాకుండా వేలిముద్రలు పడని వారి పింఛను సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వేలి ముద్రలు సరిగ్గా లేని వారి పింఛను సొమ్ము తీసుకుంటూ సొంతానికి వాడుకొని సతాయిస్తున్నట్లు సమాచారం. భీమిని, కన్నెపల్లి తదితర మండలాల్లో సదరు సొమ్ము చెల్లించేందుకు పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శుల నెలల తరబడి తమ చుట్టూ తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఆసరా పెన్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయి. ఒక్కో లబ్ధిదారునికి 2016 రూపాయల చొప్పున రావలసి ఉండగా వీటిలో 2000 మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చిల్లర లేవంటూ పది రూపాయలు మొదలు 16 రూపాయలు కోత విధిస్తూ నొక్కేస్తున్నారని అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్నెపల్లి, భీమిని తదితర మండలాల్లో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 33 వేల 539 పెన్షన్లు ఉండగా వీటిలో భీమిని, మండలంలో ఒక వెయ్యి 782 మంది లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు. కన్నెపల్లి మండల పరిధిలో 2004 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఆయా పెన్షన్లలో ఇదే రూపంలో 16 రూపాయల చొప్పున కోత విధిస్తున్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. ఇంత బాహాటంగా 16 రూపాయలు నొక్కేస్తున్న సంగతి తెలిసినా కార్యదర్శులను ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేక పోతున్నారు. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. అంతే కాకుండా తెలుగు పల్లె గ్రామంలో బీపీఎం అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
లక్షల్లో పెన్షన్ సొమ్ము స్వాహా..
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకుంటే కొన్ని లక్షల రూపాయల్లో పెన్షన్ సొమ్ము స్వాహా అవుతోంది. ఉదాహరణకు మంచిర్యాల సెగ్మెంట్ ను తీసుకుంటే ఇక్కడ మొత్తం 33 వేల 539 మంది ఫించన్ దారులు ఉన్నారు. సగటున పది రూపాయల చొప్పున లెక్కేసిన నియోజక వర్గంలో ప్రతినెలా మూడు లక్షల 30 వేల పై చిలుకు బొక్కేస్తున్నారు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 26 వేల 666 మంది, చెన్నూర్ సెగ్మెంట్ లో 27 వేల 726 మంది వివిధ విభాగాల పెన్షన్ లబ్దిదారులు ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మూడు నియోజకవర్గాల్లో వెరసి 9 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. వీరందరికీ ప్రతి నెలా 6 కోట్ల 26 లక్షల 97 వేల పై చిలుకు నిధులు మంజూరు అవుతున్నాయి. వీటిలో కొన్ని లక్షల రూపాయల్లో పెన్షన్ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కన్నెపల్లి మండలం మెట్ పల్లిలో 16 రూపాయలు బీపీఎం సత్యం దర్జాగా స్వాహా చేస్తున్నారని బాధితులు 'దిశ'కు వెల్లడించారు.
వేలి ముద్రలు రాకుంటే మరీ ఘోరం..
ఆసరా పెన్షన్లకు సంబంధించి సమయం, సందర్భం దొరికినప్పుడల్లా చేతివాటం ప్రదర్శిస్తున్న కొందరు కార్యదర్శులు ఇక వేలి ముద్రలు రాని వాళ్ళ విషయంలో వీర ప్రతాపం చూపుతున్నారనే విమర్శలు లేకపోలేదు. వృద్ధాప్యంలో ఉన్న ఆసరా లబ్దిదారుల వేలిముద్రలు రాని పక్షంలో ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన కార్యదర్శులే పింఛన్ సొమ్ము డ్రా చేస్తున్నారు. అయితే ఆ డబ్బులను మాత్రం లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక్కో లబ్ధిదారునికి నాలుగైదు నెలల నుండి కూడా ఆసరా పెన్షన్ డబ్బులు అందలేదంటే ఈ రెండు మండలాల్లో బాధిత లబ్ధిదారుల పరిస్థితి ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు. వేలిముద్ర రాలేదని సాకుతో సొమ్ములు డ్రా చేసుకొని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం ఏమిటనే ప్రశ్నలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
ఒక్కొక్కరిది ఒక్కో బాధ..
పింఛన్ సొమ్ముల చెల్లింపులో అవకతవకలకు సంబంధించి పైన ఉదహరించిన అంకు, దుర్గం చంద్రయ్య, బత్తిని రాజా గౌడ్.. తదితరులను ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇలా బాధితులందరిది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ నాలుగు నెలలైనా కన్నెపల్లి మండలం సుజ్జాపూర్ గ్రామానికి చెందిన రాజా గౌడ్ కు చెందిన పెన్షన్ సొమ్ములు కార్యదర్శి ఇంకా చెల్లించలేదంటే బాధితుని పరిస్థితి మాటల్లోనే తెలిసిపోతుంది. మరో కొంతమంది గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వేలిముద్ర పడలేదని డబ్బులు డ్రా చేసి 4 5 నెలలుగా సతాయించడంలోని అంతర్యం ఏమిటని బాధితుని కుమారుడు రమేష్ గౌడ్ వాపోతున్నారు. పెన్షన్ దారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎక్కడికక్కడ కార్యదర్శి పలువురు తోడేళ్ల లాగా పిక్కు తింటున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా బయటకు చెప్పుకోలేని బాధితులు కూడా ఎంతో మంది ఉండవచ్చని చెబుతున్నారు. అటు పదహారు రూపాయలతో పాటు ఇటు వేలి ముద్రలు పడని వారి ఫించన్ పరిస్థితి తలచుకుంటేనే తలబొప్పి కట్టిస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.