మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతకు షోకాజ్‌నోటీసులు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. సొంత పార్టీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. సొంత పార్టీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్నది. ఈక్రమంలో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా, పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే.. మరో కాంగ్రెస్ నేతకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రావి శ్రీనివాస్ ఇటీవల మంత్రి సీతక్కపై పలు విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.
పార్టీ నేతల నుంచి రావి శ్రీనివాస్ పై పలు ఫిర్యాదులు అందుకున్న కాంగ్రెస్‌పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా క్రమశిక్షణ కార్యాచరణ కమిటీ, టీపీసీసీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా డీసీసీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ విషయంలో వారంలోగా అందజేయాలని, లేనిక్షపంలో కఠిన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
